రాంచీ: చనిపోయాడని భావించి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన వ్యక్తి, కొన్ని రోజుల తర్వాత సజీవంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం షాక్‌కు గురైంది. జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది?
45 ఏళ్ల విశ్రామ్ ముండా అనే వ్యక్తి మే 10న ఒక వివాహ వేడుకకు వెళ్తూ ఇంటి నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో, సమీపంలోని ఒక కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చూడటానికి విశ్రామ్ ముండా లాగే ఉండటంతో, అది తనదేనని పొరపడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.
గ్రామస్తులు కూడా మృతదేహపు ఎత్తు, శరీర నిర్మాణం, ముఖ కవళికలు ముండాను పోలి ఉన్నాయని ధృవీకరించడంతో, గిరిజన ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఊహించని మలుపు..
అంతిమ సంస్కారాలు జరిగిన కొన్ని రోజుల తర్వాత, విశ్రామ్ ముండా తన కుమార్తె అద్దె ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. మొదట అతడిని చూసి కుటుంబ సభ్యులు భయపడినప్పటికీ, తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. ఎవరికీ చెప్పకుండా తాను రామ్‌గఢ్‌కు వెళ్లానని ముండా వివరించాడు. ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరిపిన ఆ అజ్ఞాత వ్యక్తి మృతదేహం ఎవరిదో గుర్తించడానికి, పోలీసులు ఆ సమాధిని వెలికి తీసే (Exhumation) ప్రక్రియను ప్రారంభించారు.
