అంతర్జాతీయ మార్కెట్లో వెండి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా లభించే వెండిలో మెజారిటీ వాటాను భారత్ తనవశం చేసుకుంటోందని ఆర్థిక నిపుణుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది.
చారిత్రాత్మకంగా బంగారాన్ని మాత్రమే సురక్షితమైన పెట్టుబడిగా చూసేవారు. కానీ ఇప్పుడు వెండి ప్రాముఖ్యత పారిశ్రామిక వినియోగం వల్ల అనేక రెట్లు పెరిగింది. బంగారం ఎక్కువగా బ్యాంక్ లాకర్లలో మురిగిపోతుంటే, వెండి మాత్రం పరిశ్రమలు, సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఒక ముడిసరుకుగా ఉపయోగపడుతోంది. వెండి ధర బంగారం కంటే తక్కువ కావడం, దానిని రీసైక్లింగ్ చేయడం కష్టం కావడంతో ప్రపంచ దేశాల్లో వెండి నిల్వలపై ఆందోళన పెరుగుతోంది. ఆధునిక ప్రపంచంలో వెండి కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక కీలకమైన ‘ఇండస్ట్రియల్ మెటల్’ (పారిశ్రామిక లోహం).
గ్రీన్ ఎనర్జీ.. వెండికి పెరిగిన డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) వైపు మళ్లుతుండటమే వెండికి డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం. ఒక గిగావాట్ సోలార్ విద్యుత్ తయారీకి అవసరమైన సోలార్ ప్యానెల్స్ కోసం సుమారు 20 నుండి 25 టన్నుల వెండి అవసరమవుతుంది. భారత్ పెట్టుకున్న సోలార్ లక్ష్యాలను చేరుకోవాలంటే ఏడాదికి 1200 నుండి 1500 టన్నుల వెండి కావాలి. దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), డిఫెన్స్ సెన్సార్లు మరియు 5G కమ్యూనికేషన్ పరికరాల్లో వెండి వాడకం అనివార్యమైంది.
భారత్ దిగుమతుల జోరు
భారత వెండి దిగుమతుల గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. గత కొన్ని నెలల్లోనే భారత్ సుమారు 6 బిలియన్ డాలర్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో 7.7 బిలియన్ డాలర్ల వెండిని కొనుగోలు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 129 శాతం వృద్ధి. కొన్ని త్రైమాసికాల్లో ఈ వృద్ధి ఏకంగా 400 శాతాన్ని తాకింది.
సాధారణంగా ఏడాదికి 1 నుండి 2 బిలియన్ డాలర్ల వెండిని మాత్రమే కొనే భారత్, ఇప్పుడు కొన్ని నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో నిల్వలను పోగేస్తోంది. భారత మార్కెట్ సగటు అవసరం 6,000 నుండి 7,000 టన్నులైతే, ప్రస్తుతం 15,000 నుండి 20,000 టన్నుల నిల్వలను భారత్ ప్రోగు చేస్తోంది. ఇది కేవలం చిల్లర పెట్టుబడి కాదు, దేశ భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక వ్యూహాత్మక ‘స్టాక్‌పైలింగ్’ (నిల్వ చేయడం).
చైనాకు చెక్ పెట్టే వ్యూహం
ప్రస్తుతం వెండిని శుద్ధి చేయడంలో (Refining) చైనా అగ్రస్థానంలో ఉంది. భవిష్యత్తులో చైనాతో వాణిజ్య యుద్ధం లేదా ఉద్రిక్తతలు ఏర్పడితే మన సోలార్ మరియు ఎలక్ట్రానిక్ రంగాలు కుప్పకూలకూడదని భారత్ భావిస్తోంది. సప్లై చైన్ (సరఫరా గొలుసు) దెబ్బతినకుండా ఉండటానికే భారత్ ముందుగానే వెండిని భారీగా కొనుగోలు చేస్తోంది.
సైలెంట్ డీ-రిస్కింగ్ (Silent De-risking)
పాశ్చాత్య దేశాలు ఎక్కువగా ‘పేపర్ సిల్వర్’ (కాగితం మీద జరిగే వ్యాపారం) మీద ఆధారపడుతుంటే, భారత్ మాత్రం ప్రత్యక్షంగా వెండిని (Hard Metal) కొంటోంది. బంగారం కొంటే అంతర్జాతీయంగా అందరి దృష్టి పడుతుంది, అందుకే ‘సైలెంట్ డీ-రిస్కింగ్’ పద్ధతిలో వెండిని సేకరిస్తూ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన నిల్వను భారత్ సృష్టించుకుంటోంది. ఇందుకోసం పెరూ, చిలీ వంటి లాటిన్ అమెరికా దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకుంటోంది.
పెట్రోల్, డీజిల్ అవసరం లేని ఎలక్ట్రిక్ యుగంలో భారత్ అడుగుపెడుతున్నప్పుడు వెండి లేనిదే ఆ లక్ష్యం సాధ్యం కాదు. రేపు వెండి కొరత వచ్చినప్పుడు ఇతర దేశాల ముందు చేయి చాచకుండా ఉండటానికి, ఇప్పుడే ప్రపంచ వెండి మార్కెట్‌ను భారత్ ఖాళీ చేస్తోంది. ఇది రాబోయే కాలంలో భారత సరఫరా గొలుసు రక్షణకు (Supply Chain Security) గ్యారెంటీ ఇవ్వడమే కాకుండా, భారత్‌ను ఒక ఆర్థిక మహాశక్తిగా నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు.
