హరియాణా: హరియాణాలో గుండెపోటుతో మృత్యువుతో పోరాడుతున్న ఒక వృద్ధుడిని, ప్రముఖ డెలివరీ సంస్థ ‘బ్లింకిట్’ (Blinkit) తన ఆన్లైన్ ఉచిత అంబులెన్స్ సేవ ద్వారా సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ ఇన్స్టాగ్రామ్ యూజర్ కోమల్ ఖండేల్వాల్ షేర్ చేసిన వీడియో ప్రకారం, తన ఇంట్లో ఉంటున్న ఒక వృద్ధుడికి అర్ధరాత్రి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో అంబులెన్స్‌ను సంప్రదించగా, వారు 10,000 నుండి 15,000 రూపాయల వరకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు.
అటువంటి క్లిష్ట సమయంలో, బ్లింకిట్ సంస్థ అందిస్తున్న ఉచిత అంబులెన్స్ సేవ గురించి తెలిసి వెంటనే బుక్ చేశారు. “అదొక వాణిజ్య సంస్థ అయినప్పటికీ, అత్యవసర మందులు మరియు శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన ‘5-స్టార్’ స్థాయి అంబులెన్స్‌ను పూర్తిగా ఉచితంగా అందించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి ఈ సేవను ఎప్పటికీ ఉచితంగానే కొనసాగించండి” అంటూ ఆమె ఎంతో భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, బ్లింకిట్ సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతకుముందు ఒక ప్రమాదంలో గాయపడిన రాపిడో డ్రైవర్‌ను కూడా ఇదే విధంగా బ్లింకిట్ అంబులెన్స్ ద్వారా ఉచితంగా రక్షించామని మరికొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
