నిజమైన ప్రేమకు ఎలాంటి షరతులు, అడ్డంకులు ఉండవని నిరూపించేలా.. ఓ వివాహ వేడుకలో తన దివ్యాంగుడైన భర్త కోసం నవవధువు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి హృదయాలను హత్తుకుంటోంది.
సంప్రదాయ దుస్తుల్లో, మెడలో పూలమాలతో చేతికర్రల (Crutches) సాయంతో నిలబడిన వరుడు.. తన భార్య డ్యాన్స్ చేస్తుంటే చూసి మురిసిపోతూ చిరునవ్వులు చిందించాడు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ చూసేవారిని కట్టిపడేస్తోంది.
ఎర్రటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ వధువు.. ఎలాంటి సంకోచం లేకుండా ఎంతో ఉత్సాహంగా తన భర్త ముందు డ్యాన్స్ చేసింది. ఆమె మాత్రమే నృత్యం చేయడమే కాకుండా, తన భర్తను కూడా ఆ సంతోషకరమైన క్షణాల్లో భాగం చేస్తూ అక్కడున్న వారందరిలో ఉత్సాహాన్ని నింపింది.
కల్మషం లేని ప్రేమ, పట్టరాని సంతోషంతో నిండిన ఈ అపురూప ఘట్టం నెటిజన్ల కళ్లలో ఆనందబాష్పాలు తెప్పిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ గాఢమైన అనుబంధం సోషల్ మీడియాలో విశేష స్పందనను చూరగొంటోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. “నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉండాలి” అంటూ కితాబిస్తున్నారు. శారీరక లోపాలను కాకుండా మనసు అందాన్ని చూడటమే నిజమైన బంధం అంటూ ఆ నూతన దంపతులపై ప్రశంసలు, ఆశీస్సుల వర్షం కురిపిస్తున్నారు.

Leave a Reply