అక్కడ ప్రాణం కొట్టుమిట్టాడుతోంది..! సైరన్ మోగిస్తున్న అంబులెన్స్.. నడిరోడ్డుపై కారు ఆపి వీడియోలు తీసుకుంటున్న మహిళ.. రీల్స్ పిచ్చితో చుట్టూ చేరి వీడియోలు తీసిన జనం.. నెటిజన్లను కలిచివేస్తున్న దృశ్యాలు..!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకున్న ఓ దిగ్భ్రాంతికర ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

వెనుక అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అత్యవసరంగా వెళ్లేందుకు యత్నిస్తుంటే.. ఏమాత్రం పట్టించుకోకుండా నడిరోడ్డుపై కారును అడ్డంగా ఆపేసి, గొడవను మొబైల్‌లో రికార్డు చేస్తూ కూర్చున్న ఓ మహిళ నిర్వాకంపై ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

జైపూర్‌లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియో యొక్క ప్రామాణికతపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కారును రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి, పక్కనే ఉన్న మరో వ్యక్తితో తలెత్తిన వాగ్వాదాన్ని తన మొబైల్‌లో వీడియో తీస్తూ ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో, ఆమె కారు వెనుక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగితో వచ్చిన ఓ అంబులెన్స్ ముందుకు వెళ్లలేక నిరంతరాయంగా సైరన్ మోగిస్తూ నిలిచిపోయింది. అయినప్పటికీ ఆ మహిళ ఏమాత్రం ఖాతరు చేయకుండా తన వాగ్వాదాన్ని రికార్డ్ చేసుకోవడంలోనే నిమగ్నమైంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 76 వేలకు పైగా వ్యూస్ సాధించగా, నెటిజన్లు ఆమె తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవైపు అంబులెన్స్‌కు దారివ్వని ఆ మహిళ అమానవీయ ప్రవర్తనను అందరూ తీవ్రంగా ఖండిస్తుండగా.. మరోవైపు కారును పక్కకు తీయమని చెప్పకుండా, కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తూ ఆ తతంగాన్నంతా వీడియోలు తీసుకుంటున్న చుట్టుపక్కల వారిపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Posted

in

by

Tags: