యూజీసీ విడుదల చేసిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అగ్రవర్ణాల విద్యార్థులు మరియు సంఘాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఒక ఉన్నత స్థాయి కమిటీని (High Level Committee) ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ నిబంధనలు తమకు వ్యతిరేకంగా దుర్వినియోగం కావని సాధారణ వర్గానికి భరోసా ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశం.
నేపథ్యం: జనవరి 13, 2026న ఈ నిబంధనల నోటిఫికేషన్ విడుదల కాగా, జనవరి 15 నుండి ఇవి అమలులోకి వచ్చాయి. అప్పటి నుండి నిరసనలు మొదలయ్యాయి. గతంలో రోహిత్ వేముల (తెలంగాణ), పాయల్ తడ్వి వంటి విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో.. విద్యాసంస్థల్లో కుల వివక్షకు వ్యతిరేకగా కఠిన నిబంధనలు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగానే పార్లమెంటరీ కమిటీ సిఫార్సులతో ఈ కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.
వివాదానికి ప్రధాన కారణాలు:
- తప్పుడు ఫిర్యాదులపై శిక్ష తొలగింపు: 2025 డ్రాఫ్ట్ నిబంధనల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేస్తే వారిపై జరిమానా లేదా సస్పెన్షన్ వంటి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, జనవరి 13న విడుదలైన తుది నిబంధనల్లో ఈ ‘శిక్ష’ నిబంధనను తొలగించారు. దీనివల్ల నిబంధనలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని సాధారణ వర్గం ఆందోళన చెందుతోంది.
- వివక్ష నిర్వచనం: కొత్త నిబంధనల ప్రకారం, వివక్ష అంటే కేవలం ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు ఓబీసీ (OBC) విద్యార్థుల పట్ల జరిగే దుష్ప్రవర్తన మాత్రమే. అంటే, అగ్రవర్ణాల విద్యార్థులకు ఏదైనా వివక్ష ఎదురైతే ఈ ప్రత్యేక నిబంధనల కింద ఫిర్యాదు చేసే అవకాశం లేదు.
- సమానత్వ కమిటీ: కాలేజీల్లో ఏర్పాటు చేసే ‘సమానత్వ కమిటీ’లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు మరియు దివ్యాంగులకు సభ్యత్వం ఉంటుంది. ఇది తమను రక్షణ వలయం నుండి బయట పెడుతోందని అగ్రవర్ణ సంఘాల వాదన.
ఈ ఆందోళనలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇప్పుడు నిబంధనల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరియు అవసరమైతే మార్పులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
