నటుడు అజిత్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయిన నటి షాలిని, సినిమాలకు దూరమైనా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, అనేక అవార్డులు అందుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘బేబీ షాలిని’గా తన చిలిపితనంతో అందరినీ అలరించారు.
హీరోయిన్గా ఎంట్రీ: షాలిని హీరోయిన్గా పరిచయమైన సినిమా ‘అనియాతిప్రావు’ (తమిళంలో ‘కాదలుక్కు మరియాదై’). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, ఆమె పోషించిన ‘మిని’ పాత్ర నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆమె ఎక్కడా గ్లామర్ పాత్రలకు ఒగ్గకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేశారు. ‘సఖి’ , ‘అమర్కలం’ వంటి చిత్రాలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి.
మాధవన్ షాకింగ్ వెల్లడి: ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడు మాధవన్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సఖి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక తమాషా సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. “షూటింగ్ సమయంలో షాలిని నా దగ్గరకు వచ్చి.. ‘చూడు మాధవన్, నేను అజిత్‌ను పెళ్లి చేసుకోబోతున్నాను. కాబట్టి రొమాంటిక్ సీన్లలో అతిగా నటించకు, నా దగ్గరకు రాకుండా కొంచెం దూరంగా ఉండి నటించు’ అని చాలాసార్లు కోరింది” అని మాధవన్ చెప్పారు.
దీనికి మాధవన్ బదులిస్తూ.. “హేయ్.. నాకు కూడా సరితతో పెళ్లి కాబోతోంది, నువ్వు కూడా నా దగ్గరకు రావద్దు అని చెప్పేవాడిని. కానీ ఆమె ఆ మాటలు ఎంతో నిజాయితీగా, బాధ్యతగా చెప్పింది” అని పేర్కొన్నారు.
కుటుంబానికి ప్రాధాన్యత: అజిత్‌తో వివాహం తర్వాత షాలిని సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలు చేపట్టారు. అజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నాలాంటి వ్యక్తితో జీవించడం కష్టం, అందుకు షాలినికి కృతజ్ఞతలు చెప్పాలి” అని ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోయిన్ వరకు, ఆపై అజిత్ జీవిత భాగస్వామిగా షాలిని ప్రయాణం ఒక ఆదర్శవంతమైన కథగా నిలుస్తుంది.
