లండన్: తాను 300 ఏళ్ల నాటి ఒక సముద్రపు దొంగ (పైరేట్) ఆత్మను వివాహం చేసుకున్నానని, ఆ ఆత్మకు రొమాన్స్ ఎక్కువని, ప్రతి రోజూ రాత్రి తనతో గడపడానికి వస్తుందంటూ వృత్తిరీత్యా సోది చెప్పే (టారో కార్డ్ రీడర్) అమండా టీగ్ అనే మహిళ సోషల్ మీడియాలో చేసిన వింత ప్రకటన నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు, సంచలనానికి దారితీసింది.
అమండా అనే మహిళ.. గత 2016లో “జాక్” అనే హైతీ దేశపు సముద్రపు దొంగ ఆత్మతో తాంత్రిక/ఆధ్యాత్మిక వివాహం చేసుకున్నట్లు, వారి మధ్య బంధం పూర్తిగా సంతృప్తికరంగా, సంతోషంగా సాగుతోందంటూ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది.
వింత తాంత్రిక పెళ్లి – ఆత్మకు అసూయ!
మరో సోది చెప్పే వ్యక్తి సహాయంతో, తెల్లటి వివాహ దుస్తులు ధరించి, ప్రత్యేక తాంత్రిక పూజలు, ఆచారాల ద్వారా ఆమె ఈ పెళ్లి చేసుకుంది. అయితే, తన ఆత్మ భర్తకు పొసెసివ్నెస్ (అసూయ) చాలా ఎక్కువని.. తను వేరే ఏ ఇతర పురుషుడిని కలవకూడదని, చూడకూడదని అతడు అడ్డుపడతాడని ఆమె వివరించింది. మధ్యలో తమ మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నామని, ఆ తర్వాత మళ్లీ ఇద్దరం ఒకటయ్యామని ఆమె చెప్పుకొచ్చింది.
నెటిజన్లు రెండు గ్రూపులుగా..
ఈ విచిత్రమైన ప్రేమకథకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్, పిచ్చితనం అని కొట్టిపారేస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది ఒక అరుదైన ఆధ్యాత్మిక ప్రేమకు నిదర్శనం అంటూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
