అత్తా అల్లుళ్ల ప్రాణాలు తీసిన చేపల కూర.. భార్య పరిస్థితి విషమం! కలకలం

పిల్లలతో కలిసి హోటల్‌కు వెళ్లి చేపల పులుసు తిన్న ఒక వ్యక్తి, అతని అత్త వరుసగా మరణించిన ఘటన కేరళలో కలకలం రేపింది. అతని భార్య ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

అసలేం జరిగిందంటే? కేరళలోని కొల్లాం జిల్లా, చడయమంగళంకు చెందిన షాజీ (48), తన భార్య సజినా (39), అత్త రషీదా బీవీ (58) మరియు ఇద్దరు పిల్లలతో కలిసి విళింజం ప్రాంతంలోని ‘అస్మక్’ అనే హోటల్‌కు భోజనానికి వెళ్లారు. షాజీతో పాటు కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్ కలిపి మొత్తం ఆరుగురు అక్కడ చేపల పులుసు, పరోటా, కనవాయి (స్క్విడ్) చేపల వంటకాలను తిన్నారు.

తిరుగు ప్రయాణంలో అస్వస్థత: భోజనం ముగించుకుని కారులో ఇంటికి వస్తుండగా మధ్యలోనే షాజీ, అతని భార్య, అత్తకు తీవ్రమైన వాంతులు, కళ్లు తిరగడం మొదలయ్యాయి. వెంటనే వారిని పారిపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ షాజీ, రషీదా బీవీ మరణించారు. సజినా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారితో పాటు తిన్న కారు డ్రైవర్‌కు కానీ, ఇద్దరు పిల్లలకు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు.

విచారణ ప్రారంభం: పారిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో, పాడైపోయిన చేపల పులుసు తినడం వల్ల అది ‘ఫుడ్ పాయిజనింగ్’ (విషహారం) గా మారి వీరి ప్రాణాలు తీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసి (సీజ్ చేసి), ఆహార నమూనాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags: