అత్యవసరంగా నావిగేషన్ సిస్టమ్‌ను మారుస్తున్న భారత్! ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్.. అసలేం జరిగింది?

ఢిల్లీ: భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు వేగంగా దూసుకుపోతుండటంతో, భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ తమ నావిగేషన్ సిస్టమ్స్ (Navigation Systems) ను అత్యవసరంగా మార్చే పనిలో పడ్డాయి.

ఈ మార్పులు చేయడంలో కొద్దిగా ఆలస్యమైనా ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థలన్నీ గందరగోళంలో పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనందరికీ ఉత్తర దిశ గురించి తెలుసు. సూర్యుడు ఉదయించే వైపు తిరిగి నిలబడితే, మన ఎడమ చేతి వైపు ఉండేదే ఉత్తర దిక్కు. కానీ ఆకాశంలో ప్రయాణించే విమానాలలో, సముద్రంలో వెళ్లే ఓడలలో ఖచ్చితమైన దిశను కనుగొనడం అంత సులువు కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే అయస్కాంత సూచీ (Magnetic Compass) ని కనుగొన్నారు. అందులోని ఎరుపు రంగు ముల్లు చూపే దిశనే మనం ఉత్తరంగా గుర్తిస్తాము.


అసలు సమస్య ఎక్కడ వచ్చింది?

ఈ అయస్కాంత ముల్లు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం (Magnetic Field) ఆధారంగా పనిచేస్తుంది. మనం నిలబడి ఉన్న చోటు నుండి భూమి లోపలికి దాదాపు 3,000 కిలోమీటర్ల లోతుకు వెళ్తే, అక్కడ లావా (ద్రవరూప ఇనుము, నికెల్ వంటి లోహాల మిశ్రమం) నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియే భూమికి అయస్కాంత శక్తిని ఇస్తుంది, దీనివల్లే మన కంపాస్ ముల్లు ఉత్తర దిశను చూపిస్తుంది.

అయితే, ఇక్కడే ఒక తిరకాసు ఉంది. భూగర్భంలోని ఈ ద్రవ లోహాలు నిరంతరం కదులుతుండటం వల్ల, భూమి యొక్క అయస్కాంత ఉత్తర ధ్రువ స్థానం కూడా కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది.

శాస్త్రవేత్తల షాక్

ఇంతకుముందు కెనడా వైపు కేంద్రీకృతమై ఉన్న అయస్కాంత ఉత్తర ధ్రువం, ఇప్పుడు రష్యాలోని సైబీరియా (Siberia) వైపు వేగంగా కదులుతోంది. భారతదేశం వంటి భూమధ్యరేఖకు కాస్త దగ్గరగా ఉన్న దేశాలలో ఈ వ్యత్యాసం వెంటనే స్పష్టంగా తెలియకపోవచ్చు కానీ.. చైనా, అమెరికా, జపాన్, కొరియా వంటి దేశాలలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.


అప్రమత్తమైన భారతదేశం

ఈ మార్పుల వల్ల విమానాలు, ఓడలు మరియు జలాంతర్గాములు (Submarines) ప్రయాణించేటప్పుడు దిశలను గుర్తించడంలో పెద్ద సమస్యలు ఎదురవుతాయి. అందుకోసమే అంతర్జాతీయంగా వరల్డ్ మాగ్నెటిక్ మోడల్ (World Magnetic Model – WMM) ను ఉపయోగిస్తారు. ఇది ఖచ్చితమైన ఉత్తర దిశను లెక్కించడానికి సహాయపడుతుంది. అయితే ఇప్పుడు అయస్కాంత క్షేత్రం సైబీరియా వైపునకు మారడంతో, ఈ మోడల్‌ను అత్యవసరంగా అప్‌డేట్ చేయాల్సి వస్తోంది.

ఎందుకింత పెద్ద సమస్య?

భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం తమ నావిగేషన్ డేటాను అప్‌డేట్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. అలా చేయకపోతే విమానాలు, ఓడలు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది.

ఆకాశంలో లేదా సముద్రంలో సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు కేవలం 1 డిగ్రీ కోణం తప్పుగా చూపించినా, మైళ్ల దూరం దారి తప్పి వేరే ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. అందుకే నావిగేషన్ రంగంలో ఈ ఒక్క డిగ్రీ మార్పు కూడా అత్యంత కీలకం!


Posted

in

by

Tags: