హెల్త్ డెస్క్: సాధారణంగా మనం పటికను (Alum) కేవలం షేవింగ్ చేసుకున్న తర్వాత యాంటీ సెప్టిక్‌గా మాత్రమే చూస్తుంటాం. కానీ, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పటికలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అల్యూమినియం సల్ఫేట్, పొటాషియం సల్ఫేట్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉండే పటిక, బ్యాక్టీరియాను హరించడంలో మొనగాడు. చర్మ సమస్యల నుంచి శ్వాసకోస వ్యాధుల వరకు పటికను ఎలా వాడాలో, నిపుణులు చెబుతున్న జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
నోటి పూతలకు, చిగుళ్ల సమస్యలకు చెక్!
నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా చేయడంలో పటిక అద్భుతంగా పనిచేస్తుంది.
- నోటి పూతలు: పటిక కలిపిన నీటితో పుక్కిలిస్తే నోటిలోని పుండ్లు (Mouth Ulcers) త్వరగా తగ్గుతాయి.
- దంత సమస్యలు: చిగుళ్ల నుంచి రక్తం కారడం, పంటి నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు పటిక నీరు ఒక చక్కని పరిష్కారం. ఇది బ్యాక్టీరియాను సంహరించి నోటిని తాజాగా ఉంచుతుంది.
మెరిసే చర్మం.. తగ్గే ముడతలు
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పటికకు సాటి లేదు. ఇందులో ఉండే ‘ఆస్ట్రింజెంట్’ గుణాలు గాయాలను త్వరగా మానిపిస్తాయి.
- యాంటీ ఏజింగ్: పటిక కలిపిన నీటితో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం బిగుతుగా (Skin Tightening) మారుతుంది. తద్వారా ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
- శరీర దుర్వాసన: చెమట వల్ల వచ్చే దుర్వాసన వేధిస్తుంటే.. స్నానం చేసే నీటిలో అర గ్రాము పటిక పొడిని కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆయుర్వేద చికిత్సలో పటిక పాత్ర
కేవలం బాహ్య ప్రయోజనాలే కాదు, ఆయుర్వేదంలో లోపలి వ్యాధులకు కూడా పటికను మందుగా ఉపయోగిస్తారు:
- దగ్గు, కఫం: పటికను వేయించి తయారు చేసిన భస్మాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కరిగిపోతుంది. ఆస్తమా, బ్రోన్కైటిస్ రోగులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.
- జ్వరానికి విరుగుడు: మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి పటికతో కూడిన ఆయుర్వేద మిశ్రమాలను వాడుతుంటారు.
- యూరినరీ ఇన్ఫెక్షన్స్: మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి పటిక నీటితో శుభ్రం చేసుకోవడం (External wash) మంచి ఫలితాన్ని ఇస్తుంది.
హెచ్చరిక: అతిగా వాడితే ప్రమాదమే!
పటికలో ఎన్ని లాభాలు ఉన్నాయో, వాడకంలో పొరపాట్లు చేస్తే అన్ని నష్టాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీపక్ కుమార్ ప్రకారం:
- మోతాదు ముఖ్యం: పటికను ఎప్పుడూ అర గ్రాము కంటే ఎక్కువ తీసుకోకూడదు.
- దుష్ప్రభావాలు: అతిగా వాడితే శరీరంలో ‘పిత్తం’ పెరిగి మంట, వేడి వంటి సమస్యలు వస్తాయి.
- వైద్యుని సలహా: ఏదైనా గృహ వైద్యం పాటించే ముందు, ముఖ్యంగా లోపలికి తీసుకునే మందుల విషయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
