అధికంగా చెమట పడుతోందా? మీ చెమట పట్టే తీరు మీ ఆరోగ్య సమస్యల గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండి

శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి చెమట పట్టడం అనేది ఒక సహజ ప్రక్రియ. చర్మంపై ఉండే స్వేద గ్రంథులు దీనిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరం అంతటా ఉన్నప్పటికీ నుదురు, చంకలు, అరచేతులు మరియు పాదాల అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. చెమటలో కేవలం నీరు మాత్రమే కాకుండా లవణాలు (Salts) కూడా ఉంటాయి. ఇది చర్మం నుండి ఆవిరైనప్పుడు శరీరం చల్లబడుతుంది. అయితే, మీ చెమట పట్టే విధానం మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది.

1. శరీరం అంతటా విపరీతంగా చెమట పట్టడం (Hyperhidrosis): మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా చల్లని గదుల్లో ఉన్నప్పుడు కూడా బట్టలు తడిసిపోయేలా చెమట పడుతుంటే, అది ‘హైపర్ హైడ్రోసిస్’ కావచ్చు. ఇది థైరాయిడ్ సమస్యలు (Hyperthyroidism), మధుమేహం, ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ లేదా కొన్ని రకాల క్యాన్సర్‌లకు (లింఫోమా వంటివి) సంకేతం కావచ్చు.

2. చేతులు, పాదాలు లేదా ముఖం నుండి మాత్రమే చెమట: దీనిని ‘ప్రైమరీ ఫోకల్ హైపర్ హైడ్రోసిస్’ అంటారు. ఇది సాధారణంగా హానికరం కానప్పటికీ, ఇది మీ నాడీ వ్యవస్థ (Sympathetic Nervous System) అతిగా స్పందిస్తోందని సూచిస్తుంది. ఆందోళన (Anxiety) లేదా ఒత్తిడి వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది.

3. జ్వరం లేకపోయినా రాత్రిపూట చెమటలు: చల్లని గదిలో నిద్రపోతున్నప్పుడు కూడా చెమటలతో తడిసిపోయి నిద్రలేవడం ప్రమాదకర సంకేతం (Red-flag). ఇది క్షయ (Tuberculosis), హార్మోన్ల అసమతుల్యత లేదా కొన్ని రకాల క్యాన్సర్లకు సంకేతం కావచ్చు. దీనితో పాటు బరువు తగ్గడం, అలసట ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

4. తక్కువగా చెమట పట్టడం (Anhidrosis): ఎండలో లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా అస్సలు చెమట పట్టకపోవడాన్ని ‘అన్ హైడ్రోసిస్’ అంటారు. డయాబెటిక్ న్యూరోపతి వంటి నరాల సమస్యలు లేదా జన్యుపరమైన లోపాల వల్ల స్వేద గ్రంథులు పనిచేయకపోవచ్చు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి ‘హీట్ స్ట్రోక్’ వచ్చే ప్రమాదం ఉంది.

5. ఉప్పగా ఉండే చెమట: మీ చెమట విపరీతమైన ఉప్పుగా అనిపించినా, చర్మంపై తెల్లటి పొరలు ఏర్పడినా లేదా కళ్లలోకి వెళ్తే మంటగా అనిపించినా.. మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ (లవణాలు) ఎక్కువగా కోల్పోతున్నారని అర్థం.

6. గుండె వేగంగా కొట్టుకోవడం మరియు చెమటలు: అకస్మాత్తుగా చెమటలు పట్టడం, గుండె దడ రావడం, ముఖం ఎర్రబడటం వంటివి హార్మోన్ల సమస్యలకు లేదా అడ్రినల్ గ్రంథిలో గడ్డలు (Pheochromocytoma) ఉండటానికి సంకేతం కావచ్చు.

7. చెమట వాసనలో మార్పు: చెమట వాసన అకస్మాత్తుగా అమ్మోనియా లేదా మెటాలిక్ వాసన వస్తుంటే అది కిడ్నీ సమస్యలు లేదా మధుమేహానికి సూచన కావచ్చు. కొన్ని రకాల మందులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వాసన మారవచ్చు.


Posted

in

by

Tags: