ఐదుసార్లు ఎంపీగా గెలిచి, రెండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధీర్ రంజన్ చౌదరి, ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును తేల్చే మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 23న జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడతలో బెహరాంపూర్ నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తున్నారు.
1991లో ఆయన తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పి.వి. నరసింహారావు ప్రధానిగా, జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో నబగ్రామ్ నుండి పోటీ చేసి కేవలం 1,300 ఓట్లతో ఓడిపోయిన అధీర్, ఆ తర్వాత ఐదు సార్లు ఎంపీగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి తన పునరాగమనాన్ని చాటుతున్నారు.
ఎందుకు ఈ నిర్ణయం?: “2024 లోక్‌సభ ఎన్నికల్లో బెహరాంపూర్ స్థానాన్ని కోల్పోయాను. పార్టీ నాయకత్వం నన్ను అసెంబ్లీకి పోటీ చేయమని కోరింది. కాంగ్రెస్ సైనికుడిగా నేను ఆ ఆదేశాన్ని శిరసావహించాను. ఇప్పుడు నేను మళ్లీ మొదటి నుండి నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను” అని అధీర్ వ్యాఖ్యానించారు.
మాజీ అనుచరులతో పోరు: ఈ ఎన్నికల్లో అధీర్ తన పాత స్నేహితులు మరియు అనుచరులతోనే తలపడాల్సి రావడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరపున బెహరాంపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ నరుగోపాల్ ముఖర్జీ, బీజేపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే సుబ్రత మైత్రా బరిలో ఉన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు అధీర్ చౌదరి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నవారే కావడం గమనార్హం.
సీపీఐ(ఎం) మద్దతు?: గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ(ఎం), ఈసారి విడిగా పోటీ చేస్తున్నప్పటికీ, బెహరాంపూర్‌లో అధీర్ రంజన్ చౌదరిపై ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. “అధీర్ వంటి నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం దురదృష్టకరం” అని కొందరు లెఫ్ట్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
