రాజస్థాన్ రాష్ట్రం ఝాలావాడ్‌లో, ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువతికి సంబంధించిన కేసులో వరుసగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తన భర్తను హత్య చేయడానికి ఆ యువతి సుపారీ హంతకుల కోసం వెతుకుతోందన్న ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే బలవంతంగా పెళ్లి చేసిన వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె తండ్రి, మేనమామ, భర్తతో సహా ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
2025 జూన్ 15న ఆ యువతి వయస్సు 17 ఏళ్లు ఉన్నప్పుడు.. ఆమె తండ్రి, మేనమామ దాదాపు రూ.4 లక్షలు తీసుకుని, ఆమె కంటే వయస్సులో చాలా పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో, సదరు యువతి తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో 2025 జూలై 5న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ద్వారా ఆమెను రక్షణ గృహానికి (షెల్టర్ హోమ్) తరలించారు. అయితే ఆమెకు మేజర్ వయస్సు వచ్చిన తర్వాత, ఆమెకు ఏమాత్రం ఇష్టం లేని అదే వ్యక్తితో మళ్లీ కాపురం చేయడానికి పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, 2026 ఆగస్టు 5న.. ఒకవేళ ఆమె మళ్లీ ఇంటి నుంచి పారిపోతే ఆమె తండ్రి రూ.4 లక్షలు చెల్లించాలనే నిబంధనలతో కూడిన బాండ్ పేపర్ (స్టాంప్ పేపర్) రాయించినట్లు కూడా వివరాలు వెల్లడయ్యాయి.
ఈ క్రమంలో, సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడిని సంప్రదించిన సదరు యువతి.. తన భర్తను హతమార్చేందుకు ఏర్పాట్లు చేయాలని కోరినట్లు సమాచారం. ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించడంతో, అక్టోబర్ 14న విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత బలవంతపు పెళ్లి, మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడీ వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో వెలుగుచూసిన ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply