అప్పుగా తీసుకున్న రూ.1,500 తిరిగి ఇచ్చేందుకు 84 ఏళ్ల వృద్ధుడి ఆరాటం.. మిత్రుడి కోసం అన్వేషణ!

తమిళనాడు తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టిలోని వ.ఉ.చి నగర్‌కు చెందిన 84 ఏళ్ల పరమశివం అనే వృద్ధుడు ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. ఆయనకు కోయంబత్తూరుకు చెందిన పాల్‌సామి అనే స్నేహితుడు ఉండేవారు. పాల్‌సామి గతంలో కోవిల్‌పట్టిలోని కరువాట్టు పేట (ఎండు చేపల మార్కెట్)లో వ్యాపారం చేసేవారు. ఐదేళ్ల క్రితం పరమశివం తన అత్యవసర అవసరాల కోసం పాల్‌సామి వద్ద 3,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అందులో రెండు నెలల వ్యవధిలోనే 1,500 రూపాయలను తిరిగి చెల్లించారు. ఆ తర్వాత పరమశివం అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం కావడంతో, వారిద్దరి మధ్య సంబంధం తెగిపోయింది.

మిత్రుడి కోసం అన్వేషణ
ప్రస్తుతం ఆ 1,500 రూపాయలను ఎలాగైనా తన మిత్రుడికి తిరిగి ఇచ్చేయాలని పరమశివం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పాల్‌సామి నడిపే ఆ ఎండు చేపల దుకాణం ఇప్పుడు లేదు. పాల్‌సామి గానీ, ఆయన కుటుంబం గానీ ఎక్కడున్నారో తెలియక, ఆయన గతంలో దుకాణం నడిపిన ప్రాంతాల్లో, నివసించిన చోట పరమశివం ఆరా తీసినా ఎటువంటి సమాచారం దొరకలేదు. దీంతో ఆయన ఆందోళన చెందుతున్నారు.

ఈ విషయమై పరమశివం మాట్లాడుతూ, “ఐదేళ్ల క్రితం నా అత్యవసర అవసరానికి రూ. 3,000 ఇచ్చి నా మిత్రుడు పాల్‌సామి ఆదుకున్నాడు. అందులో సగం డబ్బు తిరిగి ఇచ్చేశాను. మిగిలిన రూ. 1,500 అతనికి ఇచ్చేయాలని వెతుకుతున్నాను. అతని గురించి ఎక్కడా సమాచారం దొరకడం లేదు. అతని కుటుంబం కోయంబత్తూరులో ఉంటుందని గుర్తుంది, కానీ అక్కడ ఏ ప్రాంతంలో ఉంటారో తెలియదు” అని చెప్పారు.

మరణించేలోపు తీర్చుకోవాలని..
“నాకు వయసు పైబడింది, ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. నేను చనిపోయేలోపు ఆ మిగిలిన 1,500 రూపాయలను తనకో లేదా తన కుటుంబ సభ్యులకో ఇచ్చేయాలని అనుకుంటున్నాను. నా మిత్రుడి గురించి సమాచారం దొరకాలని ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పరమశివం కన్నీటి పర్యంతమయ్యారు. నేటి కాలంలో తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుండా ఎగవేసే వారు ఎందరో ఉంటే.. తన కష్టకాలంలో సహాయం చేసిన మిత్రుడికి ఆ బాకీ తీర్చాలని 84 ఏళ్ల వృద్ధుడు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం.


Posted

in

by

Tags: