అప్పు తీసుకుని ఎగనామం పెడుతున్నారా? మోసపోకండి.. చట్టం ద్వారా ఇలా వసూలు చేయండి!

నేటి రోజుల్లో స్నేహితులకు, బంధువులకు నమ్మకంతో డబ్బు ఇవ్వడం సర్వసాధారణం. కష్టాల్లో ఉన్నారని అడగగానే సహాయం చేస్తాం, కానీ ఆ డబ్బు తిరిగి అడిగే సమయానికి సంబంధాలు దెబ్బతింటాయి. ఫోన్ ఎత్తకపోవడం, సాకులు చెప్పడం లేదా ఎదురు దాడి చేయడం వంటివి ఎదురైనప్పుడు చాలామంది తమ డబ్బు ఇక రాదని వదిలేస్తారు. కానీ భారతీయ చట్టం ప్రకారం మీ సొమ్మును తిరిగి పొందే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ వివరాలు ఇవే:

1. కాలపరిమితి చట్టం (Limitation Act, 1963)

అప్పిచ్చిన డబ్బును తిరిగి వసూలు చేయడానికి చట్టంలో ఒక నిర్ణీత సమయం ఉంటుంది. దీనిని ‘లిమిటేషన్ యాక్ట్ 1963’ అంటారు. ఈ చట్టం ప్రకారం, మీరు అప్పు ఇచ్చిన తేదీ నుండి లేదా తిరిగి చెల్లిస్తానని వారు గడువు ఇచ్చిన తేదీ నుండి 3 ఏళ్ల లోపు మాత్రమే కోర్టులో కేసు వేయాలి. 3 ఏళ్లు దాటిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తే, మీ దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టం దృష్టిలో మీరు ఆ సొమ్మును వసూలు చేసే హక్కును కోల్పోతారు.

2. డిజిటల్ సాక్ష్యాలే కీలకం

బాండ్ పేపర్ లేదా ప్రామిసరీ నోట్ లేదని ఆందోళన చెందకండి. నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ చాట్‌లు, ఈమెయిల్స్ కూడా బలమైన సాక్ష్యాలుగా పనిచేస్తాయి.

  • సెక్షన్ 65బి: భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం డిజిటల్ సాక్ష్యాలకు కోర్టులో గుర్తింపు ఉంది.
  • ఏవి భద్రపరచాలి? బ్యాంక్ స్టేట్‌మెంట్లు, గూగుల్ పే/ఫోన్ పే స్క్రీన్‌షాట్లు, డబ్బు తీసుకున్నట్లు వారు అంగీకరించిన వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేయకుండా జాగ్రత్త చేయండి.
3. లీగల్ నోటీసు పంపండి

డబ్బు వసూలుకు మొదటి మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం ‘లీగల్ నోటీసు’. వక్రీలు ద్వారా పంపే ఈ నోటీసులో 15 నుండి 30 రోజుల గడువు ఇచ్చి, ఆ లోపు డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. చాలామంది కోర్టు గొడవలు ఎందుకని ఈ దశలోనే డబ్బు తిరిగి ఇచ్చేస్తారు.

4. సివిల్ సూట్ (Money Recovery Suit)

నోటీసు ఇచ్చిన తర్వాత కూడా స్పందన లేకపోతే సివిల్ కోర్టులో మనీ రికవరీ కేసు వేయవచ్చు. మీరు సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, బ్యాంక్ రికార్డులు ఇక్కడ సమర్పించాలి.

5. ఎక్స్-పార్టీ డిక్రీ (Ex-parte Decree)

ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి కోర్టు సమన్లు అందుకున్నప్పటికీ హాజరు కాకపోతే, కోర్టు ‘ఎక్స్-పార్టీ డిక్రీ’ జారీ చేయవచ్చు. అంటే అవతలి వ్యక్తి వాదన వినకుండానే, మీ దగ్గరున్న సాక్ష్యాల ఆధారంగా మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం. ఈ తీర్పు ద్వారా వారి ఆస్తులను జప్తు చేసి కూడా మీ డబ్బు వసూలు చేసుకోవచ్చు.


Posted

in

by

Tags: