రాయబరేలీకి చెందిన 22 ఏళ్ల అమర్ కమల్ రస్తోగి అనే యువకుడు సన్న్యాసం స్వీకరించిన ఘటన కలకలం రేపింది. జనవరి 1వ తేదీన లక్నోలోని చర్చికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వెళ్లిన అమర్, తిరిగి ఇంటికి రాలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, మూడు రోజుల తర్వాత అతని వాట్సాప్ స్టేటస్ ద్వారా అతను ప్రయాగ్‌రాజ్ మాఘ మేళాలో ఉన్నట్లు తెలుసుకున్నారు.
అమర్ అక్కడ కాషాయ వస్త్రాలు ధరించి సన్న్యాసిగా మారాడు. తన కొడుకును వెతుక్కుంటూ తల్లి సోనీ రస్తోగి మాఘ మేళాకు చేరుకున్నారు. అయితే, మొదట్లో అమర్ తన సొంత తల్లిని గుర్తుపట్టడానికి నిరాకరించడం అక్కడున్న వారిని కలిచివేసింది. తర్వాత తల్లిని హత్తుకున్నప్పటికీ, ఇంటికి రావడానికి మాత్రం ఒప్పుకోలేదు. స్వామి గోపాల్ దాస్ అనే గురువు వద్ద దీక్ష తీసుకున్నానని, ఇకపై తన జీవితం భక్తి మార్గంలోనే సాగుతుందని అతను స్పష్టం చేశాడు. ఈ ఘటనతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
