పాట్నా: దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీర జవాన్ అమరత్వం తర్వాత.. ఆయన కుటుంబంలో ఒక ఊహించని వివాదం చెలరేగింది, ఇది అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. జూన్ 13న అసోంలోని జోర్హాట్‌లో వాయుసేన (ఎయిర్ ఫోర్స్) కు చెందిన ఒక విమానం కుప్పకూలిన ఘోర ప్రమాదంలో బీహార్‌లోని జహానాబాద్‌కు చెందిన ఫ్లయింగ్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ వీరమరణం పొందారు.
శుభమ్ మరణంతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి, ఇప్పుడు ప్రభుత్వం నుండి అందే ₹21 లక్షల సహాయక నిధి (ఎక్స్‌గ్రేషియా) రూపంలో సరికొత్త కుటుంబ, చట్టపరమైన సంక్షోభం ఎదురైంది.
తమ కోడలు తమ కుమారుడిని మభ్యపెట్టి, నమ్మించి రహస్యంగా కోర్టు వివాహం చేసుకుందని, ఇప్పుడు జవాన్ మరణించిన వెంటనే ప్రభుత్వం అందించిన ₹21 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయిందని జవాన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి భార్య శ్రేయా రాయ్.. అధికారుల సహాయంతో ఆ సహాయక నిధి చెక్కును తన పేరున పొందిందని, దీని గురించి కనీసం తమ కుటుంబానికి సమాచారం కూడా ఇవ్వలేదని జవాన్ తండ్రి ఆరోపిస్తున్నారు.
ఒకవైపు దేశమంతా ఈ వీర జవాన్‌కు నివాళులర్పిస్తుంటే, మరోవైపు ఈ పరిహారం మరియు ‘రహస్య వివాహం’ చుట్టూ సాగుతున్న ఈ వివాదం సోషల్ మీడియా నుండి రాజకీయ వర్గాల వరకు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఈ సున్నితమైన వ్యవహారం ఏంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
వివాదం ఎలా మొదలైంది?
జూన్ 13న అసోంలోని జోర్హాట్‌లో భారతీయ వాయుసేనకు చెందిన ఒక ట్రాన్స్‌పోర్ట్ విమానం ప్రమాదానికి గురవడంతో లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ అమరుడయ్యారు. జూన్ 14న పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బీహార్‌లోని గయలో గల విష్ణుపద్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
అంత్యక్రియల సమయంలోనే ప్రభుత్వం తరపున అందించే ₹21 లక్షల సహాయక నిధి చెక్కును శుభమ్ భార్య శ్రేయా రాయ్‌కు అధికారులు అందజేశారని జవాన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని కన్నవారికి (తల్లిదండ్రులకు) ఇవ్వలేదని, చెక్కు చేతికి రాగానే శ్రేయా రాయ్ తన తండ్రి, సోదరుడితో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయిందని వారు ఆరోపిస్తున్నారు.
ఎన్‌డీఏ నుండి ఎయిర్‌ఫోర్స్ వరకు ప్రయాణం: శుభమ్ – శ్రేయాల పరిచయం
జహానాబాద్‌కు చెందిన శుభమ్ కుమార్ చిన్నప్పటి నుండి ఎంతో ప్రతిభావంతుడు. అతని తండ్రి అమరేంద్ర శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో శుభమ్ తన మొదటి ప్రయత్నంలోనే అత్యంత కఠినమైన ఎన్‌డీఏ (NDA) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత 2018 నుండి 2021 వరకు పుణెలో ఆర్మీకి సంబంధించిన కఠినమైన శిక్షణను పూర్తి చేసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక అతనికి మొదటి పోస్టింగ్ హైదరాబాద్‌లో లభించింది. అక్కడ ఆయన 11 నెలల పాటు తన సేవలను అందించాడు.
2025లో కుటుంబ సభ్యులు శుభమ్‌కు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించినప్పుడు.. తాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నానని శుభమ్ తన తల్లి ద్వారా కుటుంబానికి తెలిపాడు. ఆ అమ్మాయి కూడా సైన్యంలోనే లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తోందని, ఆమె పేరు శ్రేయా రాయ్ అని చెప్పాడు. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకుని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వారు అమ్మాయి కుటుంబ సభ్యులను కలిసి, ఇరువైపులా అంగీకారం కుదిరిన తర్వాత 2025 డిసెంబర్‌లో వివాహం చేయడానికి ముహూర్తం కూడా నిశ్చయించారు.
నాయనమ్మ మరణంతో వాయిదా పడిన పెళ్లి.. ‘రహస్య’ కోర్టు వివాహం!
కథలో అసలు మలుపు ఇక్కడే తిరిగింది. డిసెంబర్ 2025లో జరగాల్సిన పెళ్ళికి కొన్ని రోజుల ముందే శుభమ్ నాయనమ్మ అకస్మాత్తుగా మరణించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంట్లో మైల (సూతకం) ఉండటంతో శుభమ్ కుటుంబం ఆ వివాహాన్ని ఒక సంవత్సరం పాటు ముందుకు వాయిదా వేయాలని నిర్ణయించింది.
అయితే ఈ వాయిదా సమయంలో శ్రేయ కుటుంబ సభ్యులు శుభమ్‌ను తమ మాటల్లో దించి, అహ్మదాబాద్‌లో రహస్యంగా కోర్టు వివాహం (Court Marriage) జరిపించారని జవాన్ తండ్రి అమరేంద్ర శర్మ ఆరోపిస్తున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా శుభమ్ తన తల్లిదండ్రులకు గానీ, తమ్ముడికి గానీ తెలియనివ్వలేదు. తన కుమారుడు వీరమరణం పొంది, ప్రభుత్వ పత్రాలలో శ్రేయ పేరు అధికారికంగా వచ్చేంత వరకు తమకు ఈ పెళ్లి గురించి అస్సలు తెలియదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అంత్యక్రియల రోజే ₹21 లక్షల చెక్కు.. అధికారిపై తీవ్ర ఆరోపణలు:
జూన్ 13న విమాన ప్రమాదంలో శుభమ్ అకాల మరణం చెందిన తర్వాత, జూన్ 14న గయలోని విష్ణుపద్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. శుభమ్ చిన్న తమ్ముడు చితికి నిప్పంటించాడు. తండ్రి అమరేంద్ర శర్మ తెలిపిన దాని ప్రకారం.. అంత్యక్రియల రోజు శ్రేయ ముఖానికి మాస్క్ ధరించి అక్కడికి వచ్చింది, కానీ ఆమె హావభావాలలో భర్తను కోల్పోయిన కనీస బాధ కనిపించలేదు. ఆమె తన తండ్రి, సోదరుడితో కలిసి ఒక మూలన నిశ్శబ్దంగా నిలబడింది.
అయితే జవాన్ తండ్రి.. జహానాబాద్‌లోని హులాస్‌గంజ్ సర్కిల్ ఆఫీసర్ (CO) పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అదే రోజు శ్మశాన వాటిక సమీపంలోనే శ్రేయను పిలిచి బీహార్ ప్రభుత్వం తరపున ఇచ్చే ₹21 లక్షల చెక్కును సదరు అధికారి రహస్యంగా అందజేశారని ఆయన ఆరోపించారు. ఈ చెక్కు గురించి అధికారి గానీ, కోడలు శ్రేయ గానీ తమకు చెప్పలేదని.. చెక్కు చేతికి రాగానే శ్రేయ వెంటనే యూపీలోని తన పుట్టింటికి వెళ్లిపోయిందని అన్నారు.
రేకుల షెడ్డు కింద వృద్ధ తల్లిదండ్రులు.. అధూరంగా మిగిలిన ఇల్లు:
మీడియా కథనాల ప్రకారం.. అమరజవాన్ శుభమ్ కుమార్ కుటుంబం అత్యంత సాధారణమైనది, వారి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. కుమారుడు ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్ అయిన తర్వాత, కుటుంబమంతా కలిసి గ్రామంలో ఒక పక్కా ఇల్లు నిర్మించుకోవాలని కలలు కన్నారు. అందుకోసం వారు బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో లోన్ (Bank Loan) కూడా తీసుకున్నారు.
ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగానే.. ఈలోగా శుభమ్ మరణవార్త వచ్చింది. ప్రస్తుతం శుభమ్ తల్లిదండ్రులు గ్రామంలో రేకుల షెడ్డు (టీన్ రూఫ్) ఉన్న ఒక సగం పూర్తయిన ఇంట్లో నివసించాల్సిన దుస్థితి ఏర్పడింది. శుభమ్ పెళ్లి కల, కొత్త ఇంటి కల రెండూ అధూరంగానే మిగిలిపోయాయని, ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎలా తీర్చాలనే పెద్ద చింత వృద్ధ తల్లిదండ్రులపై పడిందని గ్రామస్థులు చెబుతున్నారు. శ్రేయ నిజంగానే తమ కుమారుడి భార్య అయితే, అంత్యక్రియల నుండి దశదిన కర్మల వరకు కుటుంబంతో కలిసి ఉండాలి కానీ, డబ్బులు అందగానే ఇలా ముఖం చాటేయడం ఏంటని తండ్రి ప్రశ్నిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
ఈ సున్నితమైన వ్యవహారాన్ని చట్టపరంగా విశ్లేషిస్తే.. శుభమ్, శ్రేయల కోర్టు వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటవుతుంది కాబట్టి, ఆర్మీ సర్వీస్ రికార్డులు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భార్యనే మొదటి వారసురాలిగా (Next of Kin) గుర్తిస్తారు.
అయితే, తల్లిదండ్రుల దయనీయ ఆర్థిక స్థితిని, బ్యాంక్ లోన్ భారాన్ని పరిగణనలోకి తీసుకుని.. నైతిక ప్రాతిపదికన ఈ సహాయక నిధిలో కొంత భాగాన్ని వృద్ధ తల్లిదండ్రులకు కూడా అందించడం సముచితం. కానీ సైనిక నిబంధనల ప్రకారం, జవాన్ అమరుడైన తర్వాత వచ్చే నగదు పరిహారం మరియు పురస్కారాలు పూర్తిగా భార్యకే దక్కుతాయి.
