హిందీ చిత్రసీమలో ఒక దర్శకుడు కేవలం 23 సినిమాలు తీస్తే, అందులో 15 సినిమాలు హిట్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ కెరీర్‌ను మలుపు తిప్పి, ఆయనకు 7 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆ గొప్ప ఫిల్మ్ మేకర్ మన్మోహన్ దేశాయ్. ఆయన జీవితంలో ఎన్నో విజయాలు, అంతకంటే ఎక్కువ విషాదాలు ఉన్నాయి.
సినిమాల రారాజు ‘మన్మోహన్ దేశాయ్’
మన్మోహన్ దేశాయ్ 1937, ఫిబ్రవరి 26న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి కీకూభాయ్ దేశాయ్ కూడా ఒక చిత్ర నిర్మాత. అయితే మన్మోహన్ 4 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించారు. కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. అన్న సహాయంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మన్మోహన్, చాలా ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే దర్శకుడిగా మారారు.
రాజ్ కపూర్, నూతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛలియా’ (1960) సినిమాతో ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత షమ్మీ కపూర్‌తో ‘బ్లఫ్‌మాస్టర్’, రాజేష్ ఖన్నాతో ‘సచ్చా ఝూఠా’, ‘రోటీ’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు.
ఒకే ఏడాదిలో 4 బ్లాక్ బస్టర్లు
మన్మోహన్ దేశాయ్ కెరీర్లో 1977 సంవత్సరం ఒక అద్భుతం. ఆ ఒక్క ఏడాదిలోనే ఆయన దర్శకత్వం వహించిన అమర్ అక్బర్ ఆంథోనీ, పర్వరిష్, ధరమ్ వీర్, చాచా భతీజా అనే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. విశేషమేమిటంటే ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అమితాబ్‌తో ఆయన ప్రయాణం అక్కడే మొదలైంది.
అమితాబ్ – దేశాయ్: విడదీయలేని జోడి
అమితాబ్ బచ్చన్‌కు సరైన హిట్లు కావాల్సిన సమయంలో మన్మోహన్ దేశాయ్ తోడయ్యారు. సుహాగ్, నసీబ్, దేశ్ ప్రేమి, కూలీ, మర్ద్, తూఫాన్ వంటి వరుస హిట్లు ఇచ్చారు. దేశాయ్ ఒకసారి అమితాబ్‌తో.. “అమిత్! నువ్వు నన్ను వదిలి వెళ్తావేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లను” అని అన్నారట.
ఆసక్తికరమైన ప్రేమకథ
మన్మోహన్ దేశాయ్ తన పక్కింటి అమ్మాయి ప్రభను ప్రేమించారు. ప్రభ ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా, చివరకు దేశాయ్ పట్టుబట్టి ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరికి కేతన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే 1979లో ప్రభ మరణించడంతో దేశాయ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నందాతో నిశ్చితార్థం.. కానీ..
భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉన్న తండ్రిని చూసి కుమారుడు కేతన్ తల్లడిల్లిపోయాడు. తన తండ్రికి నటి నంద అంటే ఇష్టమని తెలుసుకున్న కేతన్.. నటి వహీదా రెహమాన్ సాయంతో వారిద్దరికీ పరిచయం చేశాడు. 52 ఏళ్ల వయసులో మన్మోహన్ దేశాయ్, నందాతో నిశ్చితార్థం చేసుకున్నారు.
కానీ విధి మరోలా తలచింది. 1994, మార్చి 1న మన్మోహన్ దేశాయ్ తన ఇంటి బాల్కనీ నుండి కింద పడి మరణించారు. అది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనేది ఇప్పటికీ ఒక రహస్యమే. ఈ వార్త విన్న నంద కుప్పకూలిపోయింది. ఆమె ఆ తర్వాత ఎవరినీ పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయింది.
