గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడికి పాల్పడటంతో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’లో భాగంగా అల్-షువైఖ్ ఓడరేవు మరియు దుబాయ్ తీరాల్లో ఖచ్చితమైన దాడులు నిర్వహించినట్లు ఇరాన్ వార్తా సంస్థ IRGC నావికాదళాన్ని ఉద్ధరిస్తూ నివేదించింది. “యుద్ధభూమిలో ఉన్న అమెరికా సైనికులను, వారి వ్యూహాత్మక పరికరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులు సఫలమయ్యాయి” అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ (IRGC) పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆరు యుద్ధనౌకలపై విరుచుకుపడ్డ క్షిపణులు
బాలిస్టిక్ క్షిపణులు మరియు ఖాదర్ 380 క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి చేసిన ఈ ఆపరేషన్‌లో, అల్-షువైఖ్ ఓడరేవు వద్ద ఉన్న 6 అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (LCU) నౌకలపై దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం, ఈ యుద్ధనౌకల్లో 3 నౌకలు క్షిపణులు తగిలిన వెంటనే సముద్రంలో మునిగిపోయాయని, మిగిలినవి మంటల్లో చిక్కుకున్నాయని ఇరాన్ పేర్కొంది.
యుద్ధంలో ఇరాన్ పైచేయి?
అదే సమయంలో, దుబాయ్‌లోని అమెరికన్ డ్రోన్ యూనిట్ సైనికులు ఉన్న కేంద్రాలపై మరియు వారు బస చేసిన ఒక హోటల్‌పై చావేరు డ్రోన్లతో (Suicide Drones) దాడులు చేసినట్లు IRGC వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో వ్యూహాత్మక నౌకలు మునిగిపోవడమే కాకుండా, పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు కూడా మరణించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాకు జరిగిన అతిపెద్ద నష్టంగా రక్షణ నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు.
10 ఏళ్ల పాటు యుద్ధం చేసి తట్టుకోగల సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ సైన్యం బహిరంగంగా ప్రకటించింది. ఇది అమెరికా సైనికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
హూతీల హెచ్చరిక
అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇతర దేశాలు చేతులు కలిపినా లేదా ఇరాన్‌పై దాడికి ఎర్ర సముద్రాన్ని ఉపయోగించినా తాము చూస్తూ ఊరుకోబోమని హూతీ రెబల్స్ కూడా ప్రకటించారు. హూతీలు కూడా యుద్ధంలోకి దిగితే, ఎర్ర సముద్రం గుండా జరిగే నౌకాయానం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది.
