అమెరికా: బోస్టన్ నగరంలో ఒక భారీ పేలుడు శబ్దం వినిపించింది. అది వినగానే బాంబు పేలిందేమోనని ప్రజలు భయపడ్డారు, మరికొందరు భూకంపమేమోనని ఆందోళన చెంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కానీ, కొద్ది నిమిషాల తర్వాత తెలిసిన నిజం ఏమిటంటే.. ఆ విపత్తు భూమి నుంచి రాలేదు, అంతరిక్షం నుంచి వచ్చింది!
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి భూమి కూడా కంపించిందని ప్రజలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, వార్తలు వైరల్‌గా మారాయి. ఇది ఏదైనా ఉగ్రవాద దాడి, సైనిక పరీక్ష లేదా భూకంపం కాదని, భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఒక భారీ ఉల్క గాలిలోనే పేలిపోవడం వల్ల జరిగిందని నాసా (NASA) స్పష్టం చేసింది.
ఎంత వేగంతో దూసుకొచ్చింది? నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ‘ఫైర్‌బాల్’ (అగ్నిగోళం వంటి ఉల్క) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాలకు నమోదైంది. ఇది గంటకు సుమారు 1,20,700 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది. ఈశాన్య మసాచుసెట్స్ మరియు ఆగ్నేయ న్యూ హాంప్‌షైర్ మీదుగా సుమారు 64 కిలోమీటర్ల ఎత్తులో ఆ ఉల్క అనేక ముక్కలుగా విడిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలోనే భారీ పేలుడు సంభవించింది.
పేలుడు ఎంత భయంకరమైనది? ఈ ఉల్క ముక్కలైనప్పుడు విడుదలైన శక్తి సుమారు 300 టన్నుల TNT పేలుడు పదార్థానికి సమానం. ఉదాహరణకు, 2020లో లెబనాన్‌లోని బీరుట్ నౌకాశ్రయంలో జరిగిన భారీ పేలుడు దాదాపు 200-400 టన్నుల శక్తికి సమానం. ఆ పేలుడులో నగరం పెద్ద భాగం ధ్వంసమైంది. అందుకే, ఈ ఉల్క పేలినప్పుడు ప్రజలు కేవలం శబ్దాన్నే కాకుండా, భూ ప్రకంపనలను కూడా అనుభవించారు.
నాసా ఏం చెప్పింది? తూర్పు మసాచుసెట్స్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పోలీసులకు కాల్స్ చేసి పేలుడు గురించి విచారించారు. అయితే, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. ఇది ఏ ఉల్కాపాతానికి (Meteor Shower) సంబంధించినది కాదని, ఇది ఒక సహజ సిద్ధమైన అంతరిక్ష వస్తువు అని నాసా పేర్కొంది. ఇది అంతరిక్ష శిథిలాలు లేదా భూమిపై పడుతున్న ఉపగ్రహం కాదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ చిన్న చిన్న ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి, కానీ ఇంత వేగంతో దూసుకొచ్చే భారీ ఫైర్‌బాల్స్ అరుదుగా కనిపిస్తాయి. భూమిని తాకడానికి ముందే 40 మైళ్ల ఎత్తులోనే అది పేలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
