అమెరికాలో ఒక్క పన్ను పీకడానికి రూ. 2.37 లక్షలా?.. బిల్లు చూసి షాకైన భారతీయుడు..! ఆ డబ్బుతో ఇండియాకే వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుని వచ్చేయొచ్చు..!!!

అమెరికాలో దంత చికిత్సకు వసూలు చేస్తున్న విపరీతమైన ఛార్జీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన నితిన్ మల్హోత్రా, తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఒక్క పన్ను తొలగించడానికి (ఎక్స్‌ట్రాక్షన్) ఏకంగా 2,500 డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 2.37 లక్షలు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. డెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని తన సొంత జేబు నుంచే చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నితిన్, అమెరికాలో వైద్య ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు.

ఆసుపత్రికి వెళ్లిన వెంటనే దంత పరీక్ష కోసం తీసిన ఎక్స్-రేకు మాత్రమే 180 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 17 వేలకు పైగా) ఛార్జ్ చేసినట్లు నితిన్ వెల్లడించారు. బీమా సంస్థ తగ్గింపులు, రాయితీలు వర్తించినప్పటికీ, చివరికి తన వాటాగా రూ. 2.37 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. దీనికి భిన్నంగా భారతదేశంలో పన్ను తీయడం, క్లీనింగ్, రూట్ కెనాల్ వంటి అత్యాధునిక చికిత్సలన్నీ చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని గుర్తుచేశారు. దీంతో అమెరికాలోని ఎన్నారైల్లో వైద్య ఖర్చులపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రత్యేకించి దంత చికిత్సల కోసం భారతదేశానికి వెళ్లి రావడం ఆర్థికంగా ఎంతో ఆదా అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై నితిన్ తన వీడియోలో మాట్లాడుతూ.. అమెరికాలో ఒక్క దంత చికిత్సకు చేసే ఖర్చు కంటే ఇండియాకు విమానంలో వెళ్లి వచ్చే ఛార్జీలే చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అమెరికాలో ఒక పన్ను పీకడానికి రూ. 2.37 లక్షలు ఖర్చు పెట్టే బదులు.. అదే డబ్బుతో భారత్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను, బంధువులను కలిసి తిరిగి అమెరికాకు వచ్చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అమెరికా నుంచి ఇండియాకు వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్ ఛార్జీలు సుమారు 1,200 డాలర్లు (రూ. 1.14 లక్షలు) మాత్రమే అవుతాయని లెక్కలతో సహా వివరించారు.

నితిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, నెటిజన్లు అమెరికా, భారతదేశాలలోని వైద్య ఖర్చులను పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. విమాన ప్రయాణ ఖర్చులతో కలిపినా భారత్‌లోనే చికిత్స చేయించుకోవడం ఎంతో ఉత్తమమని కొందరు జోకులు పేలుస్తున్నారు. అయితే, ఆసుపత్రి స్థాయి, చికిత్స సంక్లిష్టత, బీమా పాలసీని బట్టి ఈ ఛార్జీల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. అమెరికా వైద్య వ్యవస్థలోని అధిక ఖర్చులపై ఈ ప్రవాస భారతీయుడి అనుభవం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *