న్యూఢిల్లీ: శనివారం నాడు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ప్రతీకార మిసైల్ దాడిని చేపట్టాయి. దీని ఫలితంగా టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడమే కాకుండా, కొత్త సైనిక ఘర్షణలకు దారితీసే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టెహ్రాన్ మరియు వాషింగ్టన్ మధ్య దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వార్తల ప్రకారం, ఈ దాడిలో అధ్యక్ష భవన సముదాయాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఏమన్నారు? ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్‌పై ముందస్తు దాడి (Pre-emptive Strike) ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. “ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉన్న ముప్పులను తొలగించడానికి మేము ఈ ముందస్తు దాడిని చేపట్టాము” అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఇజ్రాయెల్ ప్రజలపై తక్షణమే మిసైల్ మరియు డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే సివిల్ డిఫెన్స్ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ‘హోమ్ ఫ్రంట్’లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలోనే ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం.
