అమెరికా ఇరాన్‌కు ₹14 వేల కోట్ల నగదును విమానంలో ఎందుకు పంపింది? ట్రంప్ దీనిని ‘విమోచన క్రయధనం’ అని ఎందుకు అన్నారు?

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్‌తో జరిగిన అణు ఒప్పందం మరియు 1.7 బిలియన్ డాలర్ల నగదు చెల్లింపును ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం సుమారు 14 వేల కోట్ల రూపాయలు.

ట్రంప్ ఈ ఒప్పందాన్ని “చెత్త” అని కొట్టిపారేశారు. ఇరాన్‌కు పంపిన ఈ భారీ సొమ్మును ఆ దేశాన్ని కొనే ప్రయత్నంగా అభివర్ణించారు. నిజానికి ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనే ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. “బరాక్ హుస్సేన్ ఒబామా చేసిన ఇరాన్ అణు ఒప్పందాన్ని నేను ముగించాను. అది ఒక విపత్తు. ఒబామా వారికి 1.7 బిలియన్ డాలర్ల నగదు ఇచ్చారు. వర్జీనియా, డిసి, మేరీల్యాండ్ బ్యాంకుల్లోని నగదును విమానాల్లో నింపి ఇరాన్‌కు పంపారు. వారి విధేయతను కొనాలని చూశారు, కానీ ఇరాన్ మనల్ని చూసి నవ్వింది, బాంబుల తయారీని కొనసాగించింది” అని ట్రంప్ విమర్శించారు.

JCPOA ఒప్పందం అంటే ఏమిటి? డబ్బు ఎందుకు ఇచ్చారు?

ఈ ఒప్పందం పూర్తి పేరు Joint Comprehensive Plan of Action 2015 (JCPOA). ఒబామా హయాంలో అమెరికా, ఇరాన్ మరియు P5+1 దేశాల (బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ) మధ్య ఇది జరిగింది.

  • లక్ష్యం: యుద్ధం లేకుండానే ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం.
  • షరతులు: ఇరాన్ తన యురేనియం నిల్వలను పరిమితం చేయాలి, అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించాలి.
  • ప్రతిఫలం: ఇరాన్‌పై ఉన్న కఠినమైన ఆర్థిక ఆంక్షలను తొలగించడం, విదేశాల్లో చిక్కుకున్న ఇరాన్ డబ్బును తిరిగి ఇచ్చేయడం.
1.7 బిలియన్ డాలర్ల నగదు కథ ఏంటి?

ట్రంప్ తరచుగా ప్రస్తావించే ఈ నగదు కథ వెనుక ఒక పాత చరిత్ర ఉంది. ఇది అమెరికా ఇచ్చిన కొత్త “సహాయం” లేదా “లంచం” కాదు.

  1. పాత బాకీ: 1979 ఇరాన్ విప్లవానికి ముందు, ఇరాన్ రాజు (షా) అమెరికా నుండి సైనిక పరికరాలు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారు. విప్లవం తర్వాత ఆ ఒప్పందం రద్దయింది. అమెరికా ఆయుధాలు ఇవ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు.
  2. వడ్డీతో కలిపి: అసలు 400 మిలియన్ డాలర్లు కాగా, దశాబ్దాల వడ్డీతో కలిపి అది 1.7 బిలియన్ డాలర్లు అయింది.
  3. విమానాల్లో ఎందుకు?: అప్పట్లో ఇరాన్‌పై బ్యాంకింగ్ ఆంక్షలు ఉండటంతో డిజిటల్ ట్రాన్స్‌ఫర్ సాధ్యం కాలేదు. అందుకే యూరోలు, స్విస్ ఫ్రాంక్ నోట్లను ప్యాలెట్లలో నింపి విమానాల్లో పంపారు.
వివాదం ఎందుకు?

అమెరికా బందీలను ఇరాన్ విడుదల చేసిన సమయంలోనే ఈ డబ్బు పంపిణీ జరగడం వల్ల, ట్రంప్ దీనిని “Ransom” (విమోచన క్రయధనం) అని పిలుస్తారు. కానీ ఇది చట్టపరమైన సెటిల్మెంట్ అని ఒబామా ప్రభుత్వం వాదించింది.

1979 ఇరాన్ విప్లవం – మూల కారణం

1979 కి ముందు ఇరాన్‌ను ‘మహమ్మద్ రజా షా పహ్లావి’ పాలించేవారు. ఆయన అమెరికాకు అత్యంత సన్నిహితుడు. అయితే ఆయన నిరంకుశ పాలన, పాశ్చాత్య సంస్కృతిపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి ‘రుహోల్లా ఖొమేనీ’ నాయకత్వంలో విప్లవం వచ్చింది. షా దేశం విడిచి పారిపోయారు, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. ఆ తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య శత్రుత్వం మొదలై నేటికీ కొనసాగుతోంది.


Posted

in

by

Tags: