అమెరికాలో ఉన్న తన భర్తతో కలిసి జీవించాలన్న ఓ మహిళ కోరిక.. చివరకు ఆమె కుటుంబాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. వీసా కోసం ఆరుసార్లు ప్రయత్నించినా తిరస్కరణ రావడంతో.. అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమె, ప్రస్తుతం ఆఫ్రికాలో చిక్కుకుపోయినట్లు సమాచారం. అంతేకాదు.. ఆమెతో పాటు మరో ఇద్దరిని కిడ్నాప్ చేశామని, వారి ప్రాణాలు కావాలంటే రూ.1 కోటి ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు కుటుంబాన్ని బెదిరించినట్లు తెలుస్తోంది.
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన 30 ఏళ్ల మమతా చావడా భర్త గత మూడేళ్లుగా స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. భర్తతో కలిసి జీవించాలన్న ఉద్దేశంతో మమతా అమెరికా వీసా కోసం ప్రయత్నించగా.. ఆమె దరఖాస్తు ఏకంగా ఆరుసార్లు తిరస్కరణకు గురైంది.
దీంతో కుటుంబ సభ్యులు అక్రమ మార్గంలో ఆమెను అమెరికాకు పంపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం అల్పేష్ పంచాల్ అనే స్థానిక ఏజెంట్ ద్వారా వడోదరకు చెందిన భార్గవ్ పటేల్ అనే మానవ అక్రమ రవాణా ఏజెంట్‌ను సంప్రదించారు.
ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చొప్పున మమతా, ఆమె బావమరిది రుత్విక్ (23), మరదలు మయూరి (27) ముగ్గురినీ అమెరికాకు పంపిస్తామని ఏజెంట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు తమ పొదుపు మొత్తాన్ని కూడబెట్టి సుమారు రూ.70 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించినట్లు తెలుస్తోంది.
అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 20న ముగ్గురూ జైపూర్ నుంచి బయలుదేరి.. అబుదాబి మీదుగా ఆఫ్రికాలోని ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా చేరుకున్నారు.
అయితే అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ముగ్గురి మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో.. మూడు రోజుల తర్వాత వచ్చిన ఓ ఫోన్ కాల్ వారిని మరింత భయాందోళనకు గురిచేసింది.
‘ఖాన్’ అని పరిచయం చేసుకున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి.. “మీ ముగ్గురినీ నేను కిడ్నాప్ చేశాను. వాళ్లు ప్రాణాలతో కావాలంటే వెంటనే రూ.1 కోటి ఇవ్వాలి” అంటూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇప్పటికే ఏజెంట్లకు రూ.70 లక్షలు చెల్లించిన కుటుంబం.. ఇప్పుడు మరో రూ.1 కోటి డిమాండ్‌తో తీవ్ర ఆందోళనలో ఉంది.
మమత తండ్రి గ్రీత్భాయ్ చౌహాన్.. తన పిల్లలను ఎలాగైనా సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానవ అక్రమ రవాణా ఏజెంట్ల నేపథ్యం, ముగ్గురిని ఎవరు తీసుకెళ్లారు? ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు? ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply