టెహ్రాన్: తమ గడ్డపైకి అమెరికా సైన్యం అడుగుపెట్టాలని చూస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దురాక్రమణను అడ్డుకోవడానికి సుమారు 10 లక్షల మంది పోరాట యోధులు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ భయాలు మరింత పెరిగాయి.
ముఖ్యంగా ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ‘ఖార్గ్ ద్వీపాన్ని’ అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది.
ఇరాన్ హెచ్చరికలోని ముఖ్యాంశాలు:
- అణ్వాయుధ విధానంలో మార్పు: అమెరికా గనుక భూమార్గం ద్వారా సైనిక చర్యకు దిగితే, ప్రస్తుత అణ్వాయుధ విధానాన్ని మార్చుకోవాల్సి వస్తుందని ఇరాన్ స్పష్టం చేసింది. దేశ మనుగడకే ముప్పు వాటిల్లితే ఏ మార్గాన్నైనా అనుసరిస్తామని అయాతొల్లా అలీ ఖమేనీ అత్యంత ఆప్తులు, సైనిక ప్రతినిధులు అంతర్జాతీయ మీడియాతో వెల్లడించారు.
- 10 లక్షల సైన్యం: సరిహద్దుల్లో 10 లక్షల మంది సైనికులను మోహరించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అలాగే ‘నాన్-ప్రొలిఫరేషన్ ట్రీటీ’ (NPT) నుండి వైదొలగాలని కూడా ఇరాన్ యోచిస్తున్నట్లు సమాచారం.
- డర్టీ బాంబ్ (Dirty Bomb) ఆందోళన: ఇరాన్ వద్ద ప్రస్తుతం 400 కిలోగ్రాముల యురేనియం ఉందని అంచనా. అయితే ఇది 60 శాతం మాత్రమే శుద్ధి చేయబడింది (అణు విస్ఫోటనానికి 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం). ఈ నేపథ్యంలో, ఇరాన్ లోని తీవ్రవాద వర్గాలు ‘డర్టీ బాంబ్’ ప్రయోగించాలని ఒత్తిడి తెస్తున్నాయి. డైనమైట్ వంటి పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక కణాలను జోడించి ఈ బాంబును తయారు చేస్తారు. ఇది అణు విస్ఫోటనం అంతటి భారీ విధ్వంసం సృష్టించకపోయినా, రేడియోధార్మికతను వ్యాపింపజేసి ఒక నగరాన్ని సంవత్సరాల పాటు నివాసయోగ్యం కాకుండా చేయగలదు.
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత
హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించాలన్న అమెరికా ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఇరాన్ భారీ సన్నాహాలు చేస్తోంది. ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో, ఇరాన్ అక్కడ మందుపాతరలు (Mines) అమర్చి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది.
ట్రంప్ గడువు మరియు అమెరికా షరతులు:
- ఇరాన్ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తామన్న హెచ్చరికపై ట్రంప్ మరో 10 రోజుల గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6 వరకు ఈ కొత్త డెడ్‌లైన్ విధించారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, మరో 5000 మంది అదనపు సైనికులను పశ్చిమ ఆసియాకు అమెరికా పంపింది.
- అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. అణు కార్యక్రమాలను పూర్తిగా ఆపేయాలని, హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని అమెరికా కోరగా.. గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలని, ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ ఎదురుదాడి చేస్తోంది.
