మధ్య ప్రాచ్యం (Middle East)లో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, కువైట్‌లో పొరపాటున కూల్చివేయబడిన అమెరికా ఎఫ్-15 (F-15) యుద్ధ విమానం నుండి పారాచూట్ ద్వారా ప్రాణాలతో బయటపడిన ఒక పైలట్‌ను, ఒక స్థానిక వ్యక్తి ఇనుప రాడ్‌తో బెదిరిస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోమవారం కువైట్ గగనతలంలో మూడు అమెరికా యుద్ధ విమానాలు పొరపాటున జరిగిన కాల్పుల్లో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యాయి. విమానం నుండి దూకిన పైలట్‌ను చుట్టుముట్టిన స్థానికులు, అతను ఇరాన్ దేశస్థుడని పొరబడి ఆగ్రహంతో నినాదాలు చేశారు. ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో అతని వైపు రాగా, ఆ పైలట్ భయంతో “వెనక్కి వెళ్ళండి, ఆగండి” అని అరుస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. తాను అమెరికన్ అని నిరూపించుకున్న తర్వాతే అక్కడి వారు శాంతించి అతడిని వదిలేశారు. సుమారు 90 మిలియన్ డాలర్ల విలువైన ఈ యుద్ధ విమానాలు ఆకాశం నుండి కుప్పకూలిన దృశ్యాలు ఇప్పటికే ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు సురక్షితంగా బయటపడ్డారని అమెరికా తెలిపింది.
మరోవైపు, ఒక మహిళా పైలట్‌ను కువైట్ ప్రజలు ఆత్మీయంగా ఆహ్వానించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడిన ఆమెను స్థానికులు ఆదుకుని “మీరు సురక్షితంగా ఉన్నారు” అని ధైర్యం చెప్పారు. ఈ రెండు భిన్నమైన ఘటనలు యుద్ధ సమయంలో నెలకొన్న అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పెంటగన్ సమాచారం ప్రకారం, ఇరాన్‌తో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు నలుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇరాన్‌తో ఈ యుద్ధం నాలుగు వారాలు లేదా అంతకంటే తక్కువ సమయం ఉండవచ్చని అంచనా వేశారు. ఇరాన్ పెద్ద దేశం కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికి అంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత మధ్య ప్రాచ్యం మొత్తం యుద్ధ భూమిగా మారింది. 15 దేశాల్లో ఉన్న తమ పౌరులను వెంటనే వెనక్కి రావాలని అమెరికా హెచ్చరించింది.

Leave a Reply