“అమ్మను, అక్కను చంపేశాను.” తెల్లవారుజామున కూతురికి వచ్చిన ఫోన్ కాల్..! షాక్‌లో కుటుంబ సభ్యులు. ఆ తర్వాత తండ్రి ఏం చేశాడో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణానగర్ (భోలా ఖేడా) ప్రాంతానికి చెందిన రవీంద్ర శంకర్ (56) అనే హోంగార్డు, తన భార్య శ్యామా దులారీ (50), కూతురు పూజా సాహు (32)లను దారుణంగా హత్య చేశాడు. అక్టోబర్ 9న తెల్లవారుజామున ఒకే ఇంట్లో తల్లీకూతుళ్లు హత్యకు గురైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో భార్య, కూతురు గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. రవీంద్ర శంకర్ మొబైల్ డేటా కేబుల్‌తో వారి గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఉదయం 4 గంటల సమయంలో గుజరాత్‌లో ఉంటున్న తన మరో కూతురికి ఫోన్ చేసి, “మీ అమ్మను, అక్కను చంపేశాను” అని చెప్పాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె.. వెంటనే లక్నోలోని పారా ప్రాంతంలో ఉంటున్న తన సోదరుడికి సమాచారం అందించింది.

ఉదయం 6 గంటల ప్రాంతంలో ‘డయల్ 112’కి ఈ హత్యల గురించి సమాచారం అందింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. రవీంద్ర శంకర్ నేరుగా కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్ (ఫోరెన్సిక్) ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రవీంద్ర శంకర్, అతడి భార్య మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం భార్య శ్యామా దులారీ ఇంట్లోని నగలు తీసుకుని వెళ్లిపోయిందని, అప్పట్లో దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా నమోదైందని సమాచారం. ఇక మృతురాలైన కూతురు పూజకు గతంలోనే వివాహం జరగ్గా, భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తల్లిగారింట్లోనే ఉంటోంది. అయితే, ఈ జంట హత్యలకు దారితీసిన కచ్చితమైన కారణాలు పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *