అమ్మ ప్రేమకు సాటి ఏదీ? 6.5 లక్షల మొక్కలు నాటి అడవిని సృష్టించిన విలన్ నటుడు..!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలీవుడ్, కోలీవుడ్ మరియు టాలీవుడ్‌లలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరుగాంచిన సీనియర్ నటుడు షాయాజీ షిండే. తన 92 ఏళ్ల తల్లిపై ఉన్న ప్రేమతో మహారాష్ట్ర అంతటా సుమారు 6.5 లక్షల మొక్కలు నాటి, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన షాయాజీ షిండే జీవితం ఆరంభంలో ఎన్నో పోరాటాలతో నిండి ఉంది. 1978లో ప్రభుత్వం డ్యామ్ ప్రాజెక్టు కోసం వీరి భూమిని సేకరించింది. దానికి ప్రతిఫలంగా ఆయనకు ఇరిగేషన్ శాఖలో వాచ్‌మెన్ ఉద్యోగం ఇచ్చారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, 2022లో ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా రాణించినా, కేవలం పేరు ప్రఖ్యాతులు, డబ్బు మాత్రమే తనకు తృప్తిని ఇవ్వలేదని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రేరణ ఎలా మొదలైంది? 2016లో మహారాష్ట్రలో సంభవించిన తీవ్ర కరువు సమయంలో, ఒక గ్రామ చెరువు గట్టున నీడ కోసం ఒక్క చెట్టు కూడా లేక ప్రజలు ఎండకు పడుతున్న బాధను చూసి ఆయన చలించిపోయారు. అదే సమయంలో, తన తల్లికి 92 ఏళ్లు కావడంతో, ఎప్పుడైనా వారిని కోల్పోవచ్చు అనే భయం ఆయన్ని వెంటాడింది. మరణాన్ని జయించే శక్తి తనకు లేకపోయినా, తన తల్లి జ్ఞాపకాలను ఈ భూమిపై చిరస్థాయిగా నిలిపేందుకు ఒక మార్గాన్ని వెతికారు.

అప్పుడు తన తల్లితో ఇలా అన్నారు, “అమ్మా, నిన్ను ఎప్పటికీ సజీవంగా ఉంచే శక్తి నాకు లేదు. కానీ, నీ బరువుకు సమానమైన విత్తనాలను సేకరించి, మహారాష్ట్ర అంతటా నాటబోతున్నాను. అవి పెరిగి, పెద్దవై, నీడనిచ్చి, పూలు పూసినప్పుడు, వాటి సువాసనలో నిన్ను నేను అనుభూతి చెందుతాను.” అని భావోద్వేగంతో చెబుతూ ఈ అద్భుతమైన పనిని ప్రారంభించారు.

సహ్యాద్రి దేవరాయ్.. హైదరాబాద్ నుండి లక్షల రూపాయల విలువైన మొక్కలను తెప్పించి, తన గ్రామంలో 2,000 మొక్కలతో ‘సహ్యాద్రి దేవరాయ్’ (Sahyadri Devrai) అనే పేరుతో అడవులను సృష్టించడం మొదలుపెట్టారు. నేడు ఈ ఉద్యమం 48 వేర్వేరు ప్రాంతాలకు విస్తరించి, లక్షలాది చెట్లతో దట్టమైన అడవులుగా మారింది. 60 ఏళ్లుగా ఒక్క చెట్టు కూడా లేని ఒక గ్రామంలో, షాయాజీ షిండే కృషి వల్ల రూ. 17 లక్షల నిధులు సేకరించి, 16,000 మొక్కలు నాటడంతో నేడు ఆ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది.

చెట్లను నరికివేసే బదులు, వాటిని వేళ్లతో సహా వేరే చోటికి తరలించే (Transplantation) సాంకేతికత ద్వారా 200లకు పైగా పురాతన మర్రిచెట్లను ఆయన బతికించారు. “ఉచితంగా ఆక్సిజన్ పీల్చుకునే ప్రతి మనిషి, తన వయసుతో సమానంగా చెట్లను నాటి ప్రకృతికి తిరిగి ఇవ్వాలి” అని షాయాజీ షిండే పిలుపునిచ్చారు. ప్రభుత్వం తనకు ఆలస్యంగా కేటాయించిన భూమిని, గ్రామాలకు ఉచితంగా మొక్కలను అందించే అతిపెద్ద నర్సరీగా మార్చాలని ఆయన యోచిస్తున్నారు.


Posted

in

by

Tags: