ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే గుండె వేగం పెరగడం ఖాయం. నడిసముద్రంలో అకస్మాత్తుగా నీటి ఉపరితలం ఒక పెద్ద కొండలా పైకి లేచి, మరుక్షణమే రాక్షస అలగా మారి విరుచుకుపడుతోంది.
ప్రకృతిలో చాలా అరుదుగా సంభవించే ఈ రకమైన ప్రమాదకరమైన అలలను “రోగ్ వేవ్స్” (Rogue Waves) అని పిలుస్తారు. సముద్ర ప్రవాహాల మధ్య ఘర్షణ లేదా తీవ్రమైన గాలుల వల్ల ఇవి ఏర్పడతాయి. సుమారు 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడే ఈ అలలు, ఆ దారిలో వచ్చే ఎంతటి భారీ ఓడలనైనా అతలాకుతలం చేయగలవు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు “సముద్రం ఇంత భయంకరంగా ఉంటుందా?” అని ఆశ్చర్యపోతున్నారు. ఉత్తర అట్లాంటిక్ వంటి అలజడి ఎక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఈ దృశ్యం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సముద్ర ప్రయాణాల వెనుక ఉండే ప్రాణాపాయాన్ని ఈ వీడియో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. “విమాన ప్రయాణం ఎంతో మేలు, ఈ సముద్రాన్ని చూస్తుంటేనే మరణ భయం వేస్తోంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
