కోయడానికి సిద్ధంగా ఉన్న ఒక మేక ప్రాణాలను కాపాడటానికి ఒక చిన్నారి కన్నీళ్లతో పోరాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో నిలిచి, చూసేవారి హృదయాలను ద్రవింపజేస్తోంది.
నోరులేని ఆ జీవిపై ఆ పసిపాప చూపించిన అమితమైన ప్రేమ, కరుణ నెటిజన్ల కళ్లలో నీళ్లు తిరిగేలా చేశాయి.
ఆ వీడియోలో, కుటుంబ సభ్యులు సరదాగా మేకను కోస్తున్నట్లు నటిస్తూ చిన్నారితో ఆడుకుంటున్నారు. అయితే, నిజంగానే ఆ మూగజీవిని చంపేస్తున్నారని పొరబడిన ఆ చిన్నారి, తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఎలాగైనా ఆ మేకను కాపాడుకోవాలని తపించిపోయింది.
మేకను వదిలేయమని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ, చేతులు జోడించి వేడుకుంటున్న ఆ అమాయక పాప చర్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన పూర్తి శక్తిని ఉపయోగించి మేకను గట్టిగా కౌగిలించుకుని, దానిని కాపాడేందుకు ఆ చిన్నారి చేసిన పోరాటం అందరినీ కంటతడి పెట్టించింది.
సంతోష్ మిశ్రా లహరి అనే వ్యక్తి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన ఈ భావోద్వేగపూరితమైన వీడియో, పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించి విపరీతంగా వైరల్ అవుతోంది. పాప యొక్క ఈ స్వచ్ఛమైన ప్రేమను ప్రశంసిస్తూ లక్షలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
‘పిల్లలు సహజంగానే జంతువులకు మంచి స్నేహితులుగా ఉంటారు’ అని, ‘ఆ చిన్నారి ఏడుపు, వేడుకోలు మానవత్వానికి నిదర్శనం’ అని నెటిజన్లు భావోద్వేగంతో పేర్కొంటున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియకపోయినా, పాప చూపించిన ఈ కరుణ గుణం ఇంటర్నెట్లో వైరల్ అయి అందరి హృదయాలను గెలుచుకుంది.

Leave a Reply