అయ్యో.. కీర్తి శిఖరాల్లో వెలిగిన క్రికెట్ దిగ్గజానికి ఈ దుస్థితా..? “నడవలేని స్థితిలో వృద్ధాశ్రమంలో ఉన్న వినోద్ కాంబ్లీ”.. అభిమానులను కలిచివేస్తున్న వీడియో!

భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీ తాజా పరిస్థితికి సంబంధించిన వార్తలు క్రికెట్ అభిమానులను మరోసారి తీవ్ర ఆవేదనకు గురిచేశాయి.

ఒకప్పుడు మైదానంలో తన అద్భుతమైన బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించిన ఆ ఎడమచేతి వాటం ఆటగాడు, నేడు తన ఆరోగ్యం కోసం, రోజువారీ అవసరాల కోసం పోరాడుతుండటం విషాదకరం.

ప్రస్తుతం థానేలోని ‘నిదాన్’ వృద్ధాశ్రమంలో చికిత్స పొందుతున్న 54 ఏళ్ల వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలై వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను బాగానే ఉన్నాను, ఇక్కడ మంచి వసతులు, పరిశుభ్రత లభిస్తున్నాయి. నాకు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతోంది’ అని చెప్పారు.

అయితే, ఆశ్రమ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతం సొంత కాళ్లపై నడవలేకపోతున్నారని, రోజువారీ పనులకు ఇతరుల సహాయం అవసరమవుతోందని తెలిసింది.

వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలు కొత్తవేమీ కాదు. 2013లో ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేశారు. ఇటీవల కాలంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (మూత్రనాళ ఇన్ఫెక్షన్), కండరాల పట్టేయడం, మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యలు ఆయన జ్ఞాపకశక్తిపై, శరీర కదలికలపై తీవ్ర ప్రభావం చూపాయి.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెదడులో ఏర్పడిన రక్తం గడ్డలు ముదిరిన దశలో గుర్తించడంతో శస్త్రచికిత్స చేయడం సాద్యం కాదని తెలుస్తోంది. దీనివల్ల ఆయనకు దీర్ఘకాలిక వైద్య పర్యవేక్షణ, సంరక్షణ అవసరమయ్యాయి.

ఈ క్లిష్ట సమయంలో క్రికెట్ ప్రపంచం కాంబ్లీని విడిచిపెట్టలేదు. బీసీసీఐ (BCCI) ద్వారా ఆయనకు నెలకు రూ.30,000 పెన్షన్ అందుతోంది. దీంతో పాటు, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు చెందిన ‘ఛాంప్స్ ఫౌండేషన్’ (CHAMPS Foundation) ద్వారా గత ఏడాది నుండి ఆయన కుటుంబానికి నెలవారీ భత్యం, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే ఆయన చిన్ననాటి స్నేహితుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ సహా పలువురు కాంబ్లీ కోలుకోవడానికి నిరంతరం సహాయం అందిస్తున్నారు.

1993లో భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కాంబ్లీ, సిక్సర్లు, பౌండరీలతో విరుచుకుపడి అతి తక్కువ కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లలో డబుల్ సెంచరీలు బాదిన రికార్డును ఆయన సృష్టించారు. 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆయన ఆటతీరును నేటికీ చాలామంది కొనియాడుతుంటారు.

మైదానంలో తన అసాధారణ ప్రతిభతో అభిమానులను అలరించిన వినోద్ కాంబ్లీ, నేడు జీవితంలో అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ ను ఎదుర్కొంటున్నారు. ఆయనకు లభిస్తున్న స్నేహితుల మద్దతు, అభిమానుల ప్రేమ ఈ గడ్డు కాలాన్ని దాటేందుకు ఆయనకు బలాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *