ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు, ఆయన భార్యను గొడ్డలి, పారతో అతి దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని సృష్టించింది.
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లా గుంభీ తాడియా గ్రామానికి చెందిన ముఖేష్ సింగ్.. కనుహాట్ కాంపోజిట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా (హెడ్ మాస్టర్‌గా) పనిచేయడంతో పాటు, 2013 నుంచి మోతీగర్పూర్ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య వినీతా సింగ్ గతంలో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాకుండా, 2002లో ముఖేష్ స్థాపించిన ‘మన్రాజీ విద్యా సంస్థ’ను ఆమె నిర్వహిస్తున్నారు. ఈ దంపతులు ఆ పాఠశాల ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు ఓ షాకింగ్ సమాచారం అందింది. పాఠశాల ప్రాంగణంలో వినీతా సింగ్, అక్కడి నుంచి సుమారు 150 మీటర్ల దూరంలో ముఖేష్ సింగ్ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని సమాచారం రావడంతో, పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఘటనా స్థలం నుంచి రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, పార, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పాఠశాల ప్రాంగణంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు, ముందుగా వినీతా సింగ్‌ను దారుణంగా నరికి చంపారు. అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోవడానికి ప్రయత్నించిన ముఖేష్ సింగ్‌ను 150 మీటర్ల దూరం వరకు వెంబడించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ జంట హత్యలకు గల కారణాలేంటి? పాత కక్షలా లేక ఆస్తి తగాదాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుల్తాన్పూర్ ఎస్పీ (SP) వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ.. “మృతులను ముఖేష్ సింగ్, ఆయన భార్య వినీతా సింగ్‌గా గుర్తించాం. పదునైన ఆయుధాలతో నరికి వారిని హత్య చేశారు. నిందితులను పట్టుకోవడానికి పలు ప్రత్యేక బృందాలను (స్పెషల్ టీమ్స్) ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నాం” అని తెలిపారు.
ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడైన ముఖేష్ సింగ్, ఆయన భార్య వినీతా సింగ్ దారుణ హత్యకు గురికావడం సుల్తాన్పూర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Leave a Reply