అయ్యో..! దయచేసి అన్‌ఫాలో చేయకండి..! ప్రతిరోజూ రాత్రి ఏడుస్తూనే నిద్రపోతున్నా.. ఫాలోవర్లు తగ్గిపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన ఇన్‌స్టా సెలబ్రిటీ!

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2026 ఆగస్టులో రూ.20 లక్షల ఆదాయం ఆర్జించినట్లు చెబుతున్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దియాషా గోస్వామి, తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు, వీడియోల వ్యూస్‌ క్రమంగా తగ్గిపోతుండటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె భావోద్వేగంతో ఓ వీడియోను విడుదల చేశారు.

చిన్న వయసులోనే వ్యాపారం ప్రారంభించి ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎదురవుతున్న ఈ పరిస్థితి తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆమె వీడియోలో తెలిపారు.

గత ఏడాది నవంబర్‌లో తనకు సుమారు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారని, ఈ ఏడాది నాటికి 2 లక్షల ఫాలోవర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె చెప్పారు. అయితే ప్రస్తుతం తన ఫాలోవర్ల సంఖ్య 1.09 లక్షల వద్దే ఉందని, ఉన్న ఫాలోవర్లు కూడా వరుసగా అన్‌ఫాలో చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లి స్థిరపడాలన్న తన ముఖ్యమైన కల కూడా నెరవేరకపోవడం తనను మరింత బాధిస్తోందని ఆమె తెలిపారు.

“దయచేసి నన్నెవరూ అన్‌ఫాలో చేయకండి. నేను నెరవేర్చుకోవాల్సిన కలలు ఇంకా ఎన్నో ఉన్నాయి” అంటూ ఆమె కన్నీళ్లతో తన ఫాలోవర్లను కోరారు.

అయితే అదే సమయంలో తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనా ఎవరూ ఆత్మవిశ్వాసాన్ని, ఆశను కోల్పోవద్దని ఆమె తన ప్రేక్షకులకు సూచించారు.

ఆమె భావోద్వేగంతో చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యం చెబుతున్నారు.


Posted

in

by

Tags: