అలాస్కాలోని బేరింగ్ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో, 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల పాటు తలకిందులైన పడవను పట్టుకుని ప్రాణాలతో బయటపడిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
డెరెక్ పార్కర్ అగ్నాంగా అనే ఆ బాలుడు తన 35 ఏళ్ల సోదరుడు, 34 ఏళ్ల బంధువుతో కలిసి చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి వారు ప్రయాణిస్తున్న చిన్న పడవ సముద్రంలో ఊహించని రీతిలో బోల్తా పడింది.
సుమారు 10 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే చలిలో, ఎలాంటి ఆహారం లేదా నీరు లేకుండా రెండు రోజుల పాటు ఆ బాలుడు తలకిందులైన పడవను గట్టిగా పట్టుకుని ప్రాణాల కోసం పోరాడాడు. కానీ, అతని సోదరుడు మరియు బంధువు కళ్లముందే సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
గాలింపు చర్యల్లో పాల్గొన్న అమెరికన్ కోస్ట్ గార్డ్ విమానం బోల్తా పడిన పడవపై మోకాళ్లపై కూర్చుని ఉన్న బాలుడిని గుర్తించి, సమీపంలో ఉన్న ఒక చేపల పడవ సహాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
తీవ్రమైన అల్పోష్ణస్థితి (హైపోథెర్మియా) బారిన పడిన ఆ బాలుడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రారంభించిన క్రౌడ్ఫండింగ్ పేజీలో ఇప్పటివరకు 40,000 డాలర్లకు పైగా విరాళాలు సమకూరాయి.
