ముంబై గోరేగావ్ చెక్ నాకా సమీపంలోని దూధ్సాగర్ సొసైటీ ప్రాంతంలో గత వారం రోజులుగా ఓ చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
నివాస సముదాయాల చుట్టూ చిరుతపులి స్వేచ్ఛగా తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు, కాలనీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
ఈ చిరుతపులి సంచారం కారణంగా ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు రావాలంటే తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చీకటి పడిన తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, స్థానికులంతా పూర్తి అప్రమత్తతతో ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఈ ప్రాంతంలో చిరుత సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అటవీశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని బోను ఏర్పాటు చేసి ఆ చిరుతను బంధించి సురక్షితమైన దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నివాస ప్రాంతాల్లో భద్రతా నిఘాను ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
