మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో, డ్రైవర్ అనిల్ కుమార్ సాహు వాహనాన్ని సమీపంలోని పంక్చర్ దుకాణం వద్ద ఆపాడు.
టైర్‌ను బాగు చేసేందుకు డ్రైవర్‌తో పాటు పంక్చర్ షాపు మెకానిక్ కలిసి చక్రం విప్పే పనిలో పడ్డారు. ఆ సమయంలో, పంక్చర్ అయిన టైర్ పక్కనే ఉన్న మరో టైర్ విపరీతంగా వేడెక్కి, దాని నుంచి దట్టమైన పొగ రావడం ప్రారంభమైంది.
అయినప్పటికీ వారు టైర్‌ను తీసే పనిని అలాగే కొనసాగిస్తుండగా, ఊహించని విధంగా ఆ వేడెక్కిన టైర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు దాదాపు బాంబు పేలినంత తీవ్రంగా ఉండటంతో, ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకుంది.
ఈ ఘోర ప్రమాదంలో టైర్ పేలిన ధాటికి లారీ డ్రైవర్ అనిల్ కుమార్ ఒక కాలు తెగిపడి, అతడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. స్థానికులు అతడిని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
అంతేకాకుండా, ఘటనా స్థలంలో నిలబడి ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ భయానక ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనిపై పోలీస్ స్టేషన్ అధికారి అనిల్ పటేల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
