దుబాయ్ నుండి సుమారు 2,500 కంటైనర్లలో ఖరీదైన ఐఫోన్లు, విలాసవంతమైన పరిమళ ద్రవ్యాలను (పెర్ఫ్యూమ్స్) తీసుకెళ్తున్న సింగపూర్ జెండాతో కూడిన ‘జి.ఎఫ్.ఎస్ ప్రైడ్’ అనే కార్గో నౌకపై హొర్ముజ్ జలసంధి ప్రాంతంలో గుర్తుతెలియని వస్తువుతో దాడి జరగడంతో మంటలు చెలరేగి సముద్రంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో ఉన్న రూ.కోట్ల విలువైన ఐఫోన్ల బాక్సులు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు సముద్ర ఉపరితలంపై తేలియాడటం మొదలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు చిన్న చిన్న పడవల్లో వేగంగా చేరుకుని, సముద్రంలో తేలుతున్న ఖరీదైన వస్తువులను ఒకరితో ఒకరు పోటీపడి ఎత్తుకెళ్తున్న షాకింగ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 21 మంది సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ ధృవీకరించింది. అయితే నౌక మునిగిపోవడానికి గల కారణాలపై భిన్నమైన కథనాలు వెలువడుతున్నాయి; సముద్ర మార్గంలో అమర్చిన మందుపాతర (మైన్) పేలడం వల్లే నౌక మునిగిపోయిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొనగా.. వైమానిక లేదా క్షిపణి దాడి వల్లే నౌకలో మంటలు చెలరేగాయని మారిటైమ్ భద్రతా అధికారులు చెబుతున్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న తరుణంలో.. ప్రపంచ ముడి చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతంలో పలు వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో.. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలను పెంచేందుకు, కీలక వాణిజ్య మార్గాన్ని స్తంభింపజేసేందుకు ఇరాన్ సరికొత్త వ్యూహాలను రచిస్తోందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply