పంజాబ్లో ఓ ఎలక్ట్రిక్ వాహనం డ్రైవర్ లేకుండానే అకస్మాత్తుగా ముందుకు దూసుకెళ్లి రోడ్డుపక్కన ఉన్న పండ్ల దుకాణాన్ని ఢీకొన్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎప్పటిలాగే డ్రైవర్ వాహనాన్ని నిలిపి, కిందకు దిగిన కొద్ది సెకన్లకే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వాహనంలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా అది అదుపు తప్పి అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభించింది.
వాహనం తనంతట తానే కదలడం చూసి షాక్కు గురైన డ్రైవర్.. “నా కంట్రోల్లోనే వాహనం లేదు!” అంటూ కేకలు వేస్తూ దాన్ని ఆపేందుకు పరుగెత్తాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
అయితే అప్పటికే వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లింది. మార్గంలో పాదచారులు, ఇతర వాహనాలను రాసుకుంటూ వెళ్లి.. చివరకు రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన ఓ పండ్ల దుకాణాన్ని బలంగా ఢీకొని ఆగిపోయింది.
అదృష్టవశాత్తూ.. ఆ సమయంలో దుకాణం సమీపంలో ఉన్నవారు వెంటనే పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
అయితే పండ్ల దుకాణంలోని వస్తువులు ధ్వంసమై భారీగా నష్టం వాటిల్లింది. అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే వాహనం దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో వణికిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, వాటిలో తలెత్తే సాంకేతిక లోపాలపై చర్చ మొదలైంది.
వాహనం బ్యాటరీ లేదా యాక్సిలరేటర్ వ్యవస్థలో ఏర్పడిన సమస్య కారణంగానే ఈ ఘటన జరిగిందా అనే విషయంపై సంబంధిత సంస్థ, అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆధునిక సాంకేతికతతో తయారైన వాహనాలు అకస్మాత్తుగా అదుపు తప్పడం వాహనదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

Leave a Reply