అరుదైన జన్యుపరమైన లోపంతో శిశువు జననం: రెండు జననాంగాలు, మలద్వారం లేదు; 60 లక్షల్లో ఒకరికి మాత్రమే!

లాహోర్: పాకిస్తాన్‌లో అత్యంత అరుదైన జన్యుపరమైన లోపంతో (Genetic Anomaly) ఒక మగ శిశువు జన్మించినట్లు అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ శిశువుకు రెండు జననాంగాలు (పెనిస్) ఉన్నాయని, అయితే మలద్వారం (Anus) లేదని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్’ వెల్లడించింది.

నిపుణులైన వైద్యుల బృందం ఆ శిశువుకు ‘డిఫాలియా’ (Diphallia) అనే అరుదైన ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు నిర్ధారించింది. ఈ పరిస్థితి 60 లక్షల మందిలో కేవలం ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వారు పేర్కొన్నారు. శిశువు పరిస్థితిపై లోతైన అధ్యయనం చేసిన వైద్యులు, సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించినట్లు నివేదికలో ఉంది.

డిఫాలియా అనేది మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ లేదా మల సంబంధిత ఇతర సంక్లిష్టమైన వైకల్యాలతో ముడిపడి ఉంటుందని నివేదిక పేర్కొంది. శిశువులోని రెండు జననాంగాల ఆకృతి సాధారణంగానే ఉందని, అయితే ఒకదాని కంటే మరొకటి ఒక సెంటీమీటర్ ఎక్కువ పొడవు ఉందని డాక్టర్లు గుర్తించారు. శిశువు రెండు జననాంగాల ద్వారా కూడా మూత్ర విసర్జన చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు జననాంగాలు కూడా అగ్రచర్మంతో (foreskin) ఉన్నాయని, వాటిలో ఒకటి 2.5 సెం.మీ పొడవు, మరొకటి 1.5 సెం.మీ పొడవు ఉన్నాయని వివరించారు.

ప్రపంచంలో ఇప్పటివరకు ఇటువంటి ‘డిఫాలియా’ కేసులు కేవలం 100 మాత్రమే నమోదయ్యాయి. మొట్టమొదటి కేసు 17వ శతాబ్దంలో నమోదైంది. శిశువులో మలద్వారం లేని సమస్యను పరిష్కరించడానికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స అందించిన అనంతరం, రెండు జననాంగాలను అలాగే ఉంచి శిశువును డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. శిశువు కుటుంబంలో మరెవరికీ ఇలాంటి అరుదైన శారీరక లోపం లేదని బంధువులు తెలిపారు.


Posted

in

by

Tags: