“అర్ధరాత్రి వేళ”.. నడిరోడ్డుపై 20 ఏళ్ల యువతి ప్రసవం..! ఆసుపత్రిలో చేర్చుకోలేదా? డాక్టర్ వివరణతో అసలు విషయం వెలుగులోకి..

ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన 20 ఏళ్ల గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకోలేదని ఆరోపణలు రావడంతో.. ఆమె ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది.

జ్ఞాన్‌పూర్ ప్రాంతంలోని మహారాజా చేత్‌సింగ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జోరై ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల రాణి అనే గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. అయితే ఆసుపత్రి సిబ్బంది ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించి బయటకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

దీంతో చేసేదేమీ లేక తీవ్ర ప్రసవ వేదనతో తిరిగి వెళ్తున్న సమయంలో.. ఆసుపత్రికి ఎదురుగా ఉన్న వీధి పక్కనే అర్ధరాత్రి ఆమెకు ప్రసవం జరిగింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానిక మహిళలు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అక్కడ ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ చక్ వెంటనే ఘటనపై స్పందించారు. అప్పటికే తల్లి, బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న కుటుంబాన్ని మార్గమధ్యంలో ఆపి.. వారిని తిరిగి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనపై డాక్టర్ సంతోష్ చక్ వివరణ ఇస్తూ.. “ఆ మహిళకు రక్త పరీక్షలు నిర్వహించగా హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 5 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించాం. అందుకే మెరుగైన చికిత్స కోసం మిర్జాపూర్, బీహెచ్‌యూ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని వైద్యులు సూచించారు” అని తెలిపారు.

అయితే కుటుంబ సభ్యులకు సరైన అవగాహన లేకపోవడంతో అంబులెన్స్‌ను ఎలా పిలవాలో తెలియక.. నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు వివరించారు.

ప్రస్తుతం ఆ మహిళకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమెకు రక్త ప్లాస్మా కూడా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు 24 గంటల గడువు విధించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

అయితే ప్రసవ వేదనలో ఉన్న మహిళ ఆసుపత్రి బయటే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *