ఇరాన్లో గత వారం రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా సైన్యాలు ఇరాన్‌లోని వివిధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దాడులు చేస్తున్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. యుద్ధం కారణంగా ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేసింది.
భారత్‌పై ప్రభావం
దీనివల్ల అనేక నౌకలు గల్ఫ్ దేశాల్లోనే చిక్కుకుపోయాయి. భారత్‌కు అవసరమైన ముడి చమురులో దాదాపు 60 శాతానికి పైగా హార్ముజ్ జలసంధి ద్వారానే రావాల్సి ఉంటుంది. ఇరాన్ చర్యతో భారత్‌కు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం భారత్ వద్ద సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ చమురు కొరత ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుంది.
అమెరికా అనూహ్య నిర్ణయం
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా తన పంథాను మార్చుకుంది. భారత్‌కు ఒక పెద్ద వెసులుబాటు కల్పించింది. ఇంధన కొరతను నివారించడానికి భారత్ ప్రస్తుతం రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయవచ్చని అమెరికా ప్రకటించింది. గతంలో రష్యా నుండి చమురు కొన్నందుకు భారత్‌పై అదనపు ఆంక్షలు లేదా పన్నుల గురించి మాట్లాడిన అమెరికా, ఇప్పుడు హఠాత్తుగా అనుమతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.
అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తే ఇంధన కొరతను అధిగమించడానికి రాబోయే 30 రోజుల పాటు భారత్ రష్యా నుండి చమురు తీసుకోవచ్చని తెలిపారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటానికే ఈ తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
రష్యా నుంచి ఆఫర్
మరోవైపు, రష్యా కూడా భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల ముడి చమురును అందించడానికి ముందుకు వచ్చింది. దీనివల్ల భారత్‌లో చమురు సరఫరా యధావిధిగా కొనసాగి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా అదుపులో ఉండే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిలోకి ఏ నౌక ప్రవేశించినా పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply