ATMలోకి ఇద్దరు దుండగుల ప్రవేశం.. లోపల రూ.16 లక్షలకు పైగా నగదు.. ధైర్యంగా షట్టర్ మూసేసిన మహిళా మేనేజర్.. 8 నిమిషాల్లో పోలీసుల ఎంట్రీతో దొంగలకు చెక్!
అర్ధరాత్రి వేళ ఊరంతా నిద్రలో ఉండగా.. ATM సెంటర్లో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన ఓ మహిళా బ్యాంక్ మేనేజర్ ఎంతో ధైర్యంగా వ్యవహరించి.. ATMలోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులను లోపలే బంధించారు. ఆ తర్వాత కేవలం 8 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ సమీపంలోని మార్వార్ ముండ్వా ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం.
యూకో బ్యాంక్‌కు చెందిన ATM కేంద్రంలో వరుసగా మూడు రోజుల బ్యాంకు సెలవులు ఉండటంతో రూ.16,00,900 నగదు నింపి ఉంచారు.
బ్యాంకు భవనం పై అంతస్తులోనే బ్రాంచ్ మేనేజర్ శారికా చౌదరి నివసిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2:04 గంటలకు అజ్మీర్ ప్రాంత భద్రతా అధికారి గౌతమ్ నాగర్ నుంచి ఆమెకు అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది.
ATMకు సంబంధించిన ఈ-సర్వైలెన్స్ వ్యవస్థలో కొందరు అనుమానాస్పద వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించామని ఆయన ఆమెకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శారికా తన భర్తతో కలిసి కిందకు వచ్చారు. ATM వద్దకు వెళ్లి పరిశీలించగా.. షట్టర్ సగం వరకు మూసి ఉండటంతో పాటు లోపల కొందరు వ్యక్తులు కదులుతున్నట్లు ఆమె గుర్తించారు.
అయితే భయపడకుండా ఆమె వెంటనే బయట నుంచి షట్టర్‌ను పూర్తిగా మూసి తాళం వేసేశారు. దీంతో ATMలో ఉన్న దుండగులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత తెల్లవారుజామున 2:13 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కేవలం 8 నిమిషాల్లోనే పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పూర్బారామ్ ఆధ్వర్యంలోని పోలీసులు ATM వద్దకు చేరుకుని షట్టర్ తాళం తెరిచి లోపలికి వెళ్లారు.
అక్కడ ఇద్దరు యువకులు ముఖాలకు మాస్కులు ధరించి పోలీసులకు చిక్కిపోయి ఉన్నారు.
పోలీసులు వారిని తనిఖీ చేయగా.. ATM మెషీన్ పైభాగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. అంతేకాకుండా CCTV కెమెరాలకు గ్రీజు పూసి, కనెక్షన్ వైర్లను కూడా కట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వారి వద్ద గ్యాస్ కట్టర్, స్క్రూడ్రైవర్ తదితర పరికరాలు ఉన్నట్లు సమాచారం. నగదు ఉన్న బాక్స్‌ను తెరిచి డబ్బును దోచుకునేలోపే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరూ పట్టుబడ్డారు.
మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ATMలో భారీ మొత్తంలో నగదు ఉన్న సమయంలో దుండగులు చొరబడినా.. మహిళా మేనేజర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం, పోలీసులు వేగంగా స్పందించడంతో నగదు సురక్షితంగా మిగిలింది.
ఈ ఘటనకు సంబంధించిన CCTV దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. మహిళా మేనేజర్ ధైర్యంగా వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply