ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఒక మిస్టరీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఒక వ్యక్తి దారుణ హత్యకు గురికాగా, ఆ హత్య చేసింది మరెవరో కాదు, స్వయానా అత్తేనని తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. అల్లుడి వేధింపులు భరించలేక, ఆమె ఇద్దరు కిరాయి హంతకులను (సుపారీ కిల్లర్స్) నియమించి, లక్ష రూపాయల సుపారీ ఇచ్చి అల్లుడిని అంతమొందించింది. ప్రస్తుతం అత్తతో సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కేసు నేపథ్యం: సిరగట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలికా నగర్ తిఫరాలో ఒక మృతదేహం లభ్యమైంది. అది 24 ఏళ్ల సాహిల్ కుమార్ పాట్లే అని పోలీసులు గుర్తించారు. అతను జాంగీర్ చంపా జిల్లాకు చెందినవాడు. మొదట్లో ఇది ‘బ్లైండ్ మర్డర్’ (నిందితుల ఆచూకీ తెలియని హత్య)గా మారడంతో, పోలీసులు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, ఎంతో శ్రమించి ఈ కేసును ఛేదించారు.
ఎందుకు ఈ దారుణం? మృతుడు సాహిల్ కుమార్ మద్యానికి బానిస, నిత్యం తన భార్య వర్షను కొట్టేవాడు. ఈ విషయాలను వర్ష తన తల్లి సరోజిని ఖూంటెకి చెబుతూ బాధపడేది. అల్లుడి అరాచకాలు శృతిమించడంతో, విసిగిపోయిన అత్త సరోజిని, తన అల్లుడిని చంపేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఒక లక్ష రూపాయలకు సుపారీ ఇచ్చి, మొదట 8 వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించింది. కిరాయి హంతకులు సాహిల్‌ను హత్య చేశారు.
పోలీసుల విచారణ: పోలీసులు తమ ఇన్ఫార్మర్ల ద్వారా మరియు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కఠినంగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. భార్య వర్ష (20), అత్త సరోజిని (38)తో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బిలాస్పూర్ జిల్లా చకర్భాతా పోలీస్ స్టేషన్ అధికారులు నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
