ఇరాన్ యుద్ధ వార్తలు: అమెరికా ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్ ఇకపై పోరాడాలని అనుకోవడం లేదని, చర్చలకు మొగ్గు చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు. తాము ఇరాన్ అగ్రనేతలతో కాల్పుల విరమణ (Ceasefire) గురించి మాట్లాడుతున్నామని ఆయన తెలిపారు.
ట్రంప్ అభిప్రాయం ప్రకారం ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం ట్రంప్ వాదనలను ‘అబద్ధం’ అని కొట్టిపారేసింది. చమురు మార్కెట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. అయితే, తన అగ్రనేతలందరినీ కోల్పోయిన ఇరాన్ నిజంగానే యుద్ధం ఆపడానికి సిద్ధంగా ఉందా? అంటే.. అవుననే సమాధానం ఇస్తూనే ఇరాన్ కొన్ని కఠిన షరతులను విధించింది.
ఇరాన్ విధించిన షరతులు ఇవే: అమెరికా మరియు ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ కూడా సిద్ధమే, కానీ అది ఊరికే జరగదు. ఇరాన్ ప్రధానంగా రెండు డిమాండ్లను ముందుంచింది:
- ఆంక్షల తొలగింపు: ఇరాన్‌పై ఉన్న అన్ని అంతర్జాతీయ ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలి.
- యుద్ధ నష్టపరిహారం: ఈ యుద్ధం వల్ల ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలి. ఈ రెండు షరతులకు అమెరికా ఒప్పుకుంటేనే యుద్ధాన్ని ఆపేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ట్రంప్ అంగీకరిస్తారా? ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “యుద్ధం ముగింపు అనేది ఇరాన్ చేతుల్లోనే ఉంది. అమెరికా పూర్తి నష్టపరిహారం చెల్లించి, భవిష్యత్తులో మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోబోమని గ్యారెంటీ ఇస్తేనే ఇది సాధ్యం” అని పేర్కొన్నారు. చమురు ధరలను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఇరాన్ చమురుపై కొన్ని ఆంక్షలను తొలగించింది, దీనివల్ల 140 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని ఇరాన్ తన విజయంగా భావిస్తోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. ఈ యుద్ధానికి వాషింగ్టన్ (అమెరికా) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను వెనక్కి తీసుకోవాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని కోరారు. ఈ షరతులు లేకుండా ఎటువంటి కాల్పుల విరమణను అంగీకరించబోమని స్పష్టం చేశారు.
వైట్ హౌస్ స్పందన: ఈ సున్నితమైన దౌత్య చర్చల గురించి వార్తా సంస్థ ANI అడిగిన ప్రశ్నకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ సమాధానమిస్తూ.. “ఇవి చాలా రహస్యమైన చర్చలు. అమెరికా ప్రభుత్వం మీడియా ద్వారా వీటిపై స్పందించదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎటువంటి ఊహాగానాలను నమ్మవద్దు” అని పేర్కొన్నారు.
