పాఠశాల అంటే విద్యార్థులు చదువుకునే సరస్వతీ దేవి ఆలయం. కానీ, ఆ పవిత్రమైన విద్యాసంస్థ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించి, ఒకరి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సమీపంలోని దూదూ (Dudu) ప్రాంతం ఇది. ఇక్కడున్న ‘స్వామి వివేకానంద ప్రభుత్వ మోడల్ స్కూల్’ యధావిధిగా ఆదివారం సెలవు కావడంతో తాళం వేసి ఉంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బాబు అనే యువకుడు నడుచుకుంటూ వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొని దారుణంగా మృతి చెందాడు.
యువకుడి మృతదేహాన్ని తీసుకుని అతని కుటుంబ సభ్యులు, మరికొందరు గ్రామస్థులు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆ ప్రభుత్వ పాఠశాల వైపు దూసుకువచ్చారు. అది చూసి షాక్ కు గురైన స్కూల్ వాచ్మెన్ జగదీష్ గుర్జార్ వారిని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వాచ్మెన్ మాట వినని ఆ గుంపు పాఠశాల ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించింది.
మృతదేహాన్ని పాఠశాల వెనుక భాగానికి తీసుకెళ్లి వెంటనే నిప్పుపెట్టి దహన సంస్కారాలు ప్రారంభించారు. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే సగం మృతదేహం కాలి బూడిదైపోయింది.
“గతంలో ఇది మా సామాజిక వర్గానికి చెందిన స్మశానవాటిక; ఆ తర్వాతే పాఠశాలకు మార్చారు” అని దహన సంస్కారాలు చేసిన వారు కారణం చెప్పారు. కానీ, ఈ ఆరోపణలను పాఠశాల యాజమాన్యం పూర్తిగా ఖండించింది. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ సరితా మీనా మాట్లాడుతూ, “ఈ భూమిని 2008లోనే పాఠశాల యాజమాన్యం పేరిట అధికారికంగా రిజిస్టర్ చేశారు. గత 18 ఏళ్లుగా ఇక్కడ ఎలాంటి దహన సంస్కారాలు జరగలేదు. విద్యార్థులు ఆడుకునే మైదానంలోకి అక్రమంగా ప్రవేశించి, తాళం పగలగొట్టి మృతదేహాన్ని దహనం చేశారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, మున్సిపల్ కౌన్సిలర్ అవధేష్ శర్మ మాట్లాడుతూ.. పాఠశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే పబ్లిక్ శ్మశానవాటిక ఉందని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ ఘటనపై రెవెన్యూ శాఖ విచారణకు ఆదేశించిన దూదూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) గులాబ్ సింగ్ వర్మ.. ప్రభుత్వ పాఠశాల తాళం పగలగొట్టి అక్రమంగా ప్రవేశించిన వారిపై కఠినమైన పోలీసు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థ పవిత్రతను దెబ్బతీసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Leave a Reply