గ్వాలియర్: సాధారణంగా పిల్లల పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు అన్ని విషయాలు ఆరా తీస్తారు. అబ్బాయి ఉద్యోగం, అమ్మాయి చదువు, కుటుంబ నేపథ్యం వంటివన్నీ చూస్తారు. కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఊహించని కారణాల వల్ల పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోతుంటాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది? మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, ఈసాగఢ్ సమీపంలోని ఒడిలా గ్రామంలో ఒక వివాహ వేడుక జరుగుతోంది. రెండు నెలలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, బారాత్ కూడా వచ్చింది. పెళ్లి పీటల మీద వరుడు, వధువు కూర్చున్నారు, సగం రిత్యువల్స్ కూడా పూర్తయ్యాయి. కానీ, ఏడు అడుగులు పూర్తి కాకముందే ఆ పెళ్లి ఆగిపోయింది. వరుడు ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
పెళ్లి ఆగిపోవడానికి కారణాలు:
- గోత్రం సమస్య: వధువు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. వరుడు మరియు వధువు ఇద్దరి గోత్రం ఒకటేనని, ఆ కారణంగా వారు అన్నదమ్ముల వరస అవుతారని తెలిసి పెళ్లిని ఆపేశామని చెప్పారు. వీరిద్దరి గోత్రం ‘నక్టెలే’ అని, అందుకే ఈ వివాహాన్ని రద్దు చేశామని వధువు తరపు వారు పేర్కొన్నారు.
- బారాత్ వాహనాల వివాదం: మరోవైపు వరుడి కుటుంబం మాత్రం వధువు తరపు వారి ఆరోపణలను కొట్టిపారేసింది. తాము బారాత్‌ను జీపుల్లో లేదా బస్సుల్లో తీసుకెళ్లడం లేదని, ట్రక్కులు మరియు ట్రాక్టర్లలో తీసుకెళ్లడం వధువు కుటుంబానికి నచ్చలేదని వారు ఆరోపించారు. తమకు ఆర్థిక స్తోమత లేక, బడ్జెట్ సరిపోక ట్రక్కుల్లో తీసుకెళ్తే, వారు అవమానంగా భావించి పెళ్లిని రద్దు చేశారని వరుడి కుటుంబం వాదించింది.
పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ: పెళ్లి రద్దు కావడంతో ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పెళ్లి కోసం తెచ్చిన కట్నకానుకలను కూడా వధువు తరపు వారు వెనక్కి తీసుకున్నారు. మొదట అన్నీ తెలుసుకుని పెళ్లికి ఒప్పుకున్నారని, చివర్లో వాహనాల పేరుతో సాకులు వెతుకుతున్నారని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వధువు తరపు వారు మాత్రం ఈ పెళ్లికి ఏమాత్రం సిద్ధంగా లేరు. ప్రస్తుతం పోలీసులు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
