గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసిన అత్యంత అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమైన తర్వాత మరొకరితో కలిసి జీవిస్తున్న ఒక మహిళను, ఆమెతో ఉన్న వ్యక్తిని ‘శుద్ధి ఆచారం’ పేరుతో నలుగురి ముందే కనికరం లేకుండా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనలో సదరు మహిళ భర్త, అతని బంధువులు సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత మహిళ తన భర్తను వదిలేసి చోటిలా ప్రాంతంలో మరొకరితో నివసిస్తోంది. గతంలో కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా వెనక్కి తీసుకువచ్చినప్పటికీ, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి తన ప్రియుడి వద్దకే వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, అతని బంధువులు ఆ జంటను వెతికి పట్టుకుని సురేంద్రనగర్‌కు బలవంతంగా లాక్కొచ్చారు. అక్కడ సదరు యువకుడిని చెట్టుకు కట్టేసి, మహిళను గదిలో బంధించి చీపుర్లు, చెక్క దుంగలతో విచక్షణారహితంగా చితకబాదారు.
అంతటితో ఆగకుండా, స్థానికుల ముందే ఆ యువకుడితో అసహ్యకరమైన పనులు చేయించడమే కాకుండా, సదరు మహిళ మూత్రం తాగాలని బలవంతం చేస్తూ అత్యంత పైశాచికంగా వేధించారు. ఈ దారుణాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయానక వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, జిల్లా ఎస్పీ (SP) నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. బాధిత మహిళను గుర్తించి వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు, ఈ దుశ్చర్యకు పాల్పడిన 9 మందిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
