రాజస్థాన్లోని జైపూర్, కర్ధనీ ప్రాంతంలో భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలను కిరాతకంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న రాహుల్ ఝా అనే నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
గత సెప్టెంబర్ 11న గోవింద్ వాటిక ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్యోదంతంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులను అంతమొందించిన తర్వాత ఆ నిందితుడు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా నింపాదిగా స్నానం చేసి, తన తండ్రికి టీ కూడా పెట్టి ఇచ్చి అక్కడి నుంచి పరారైనట్లు తేలింది.
పోలీసుల విచారణలో నిందితుడు రాహుల్ ఝా ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం… తన పెద్ద కుమార్తె ప్రవర్తనపై అతడికి చాలా కాలంగా తీవ్ర ఆగ్రహం ఉండేది. బంధువుల అబ్బాయిలతో బయట తిరగడం, ఇటీవల ఒక యువకుడితో కలిసి కావడి యాత్రకు వెళ్లడం వంటి పనులతో రగిలిపోయిన అతడు, మొదట ఆమెను మాత్రమే చంపాలని పథకం వేశాడు. అయితే, పెద్ద కూతురిని చంపి తాను జైలుకు వెళితే, భార్యను, మిగతా ఇద్దరు చిన్న పిల్లలను ఎవరు పోషిస్తారనే ఆలోచన అతడికి వచ్చింది.
ఆ ఆలోచనతోనే కుటుంబం మొత్తాన్ని ఒకేసారి అంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఒక ఉంగరాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం రీంగస్ ప్రాంతానికి పారిపోయిన రాహుల్ ఝాను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందం వెంబడించి పట్టుకుంది. కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను కడతేర్చిన ఈ కర్కోటక తండ్రి చర్య స్థానికంగా తీవ్ర భయాందోళనలను, దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
