ఆమ్ ఆద్మీ పార్టీలో నా గొంతు నొక్కేశారు: రాఘవ చద్ధా ఆవేదన; 7 గురు ఎంపీలం తప్పు చేశామంటే ఎవరూ నమ్మరు!

ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, తాను ఆప్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరిస్తూ రాఘవ చద్ధా ఇన్ స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, పని చేసే వాతావరణం లేకపోవడాన్ని ఆయన అందులో పూసగుచ్చినట్లు వివరించారు.

‘పాత పార్టీ ఇప్పుడు లేదు’ రాఘవ చద్ధా మాట్లాడుతూ.. “రాజకీయాల్లోకి రాకముందు నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా మంచి కెరీర్‌ను కలిగి ఉన్నాను. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో నేను ఒకడిని. నా యవ్వనంలోని 15 ఏళ్లను ఈ పార్టీ కోసం ధారపోశాను. రక్తం, చెమట చిందించి పార్టీని నిర్మించాను. కానీ, ఈరోజు ఆ పాత పార్టీ ఇప్పుడు లేదు. పార్టీలో పని చేసే వాతావరణం విషపూరితంగా (Toxic) మారింది” అని ఆరోపించారు.

నా ముందున్న మూడు ఆప్షన్లు: పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి, తాను ఒక తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని భావించానని రాఘవ పేర్కొన్నారు. ఆ సమయంలో తన ముందు మూడు దారులు ఉన్నాయని ఆయన చెప్పారు:

  1. రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకోవడం.
  2. అదే పార్టీలో ఉండి పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నించడం (కానీ అది సాధ్యం కాలేదు).
  3. తన అనుభవాన్ని, శక్తిని మరో వేదిక (మరో పార్టీ) ద్వారా ప్రజల కోసం ఉపయోగించడం.

ఏడుగురం తప్పు ఎలా అవుతాం? “నేను ఒక్కడినే కాదు, నాతో పాటు మరో ఆరుగురు ఎంపీలు కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాం. ఒకరు తప్పు చేయవచ్చు, ఇద్దరు తప్పు చేయవచ్చు.. కానీ ఏడుగురు ఎంపీలు ఒకేసారి తప్పు ఎలా అవుతారు? ఒక పని చేసే చోట మనల్ని అడ్డుకుంటే, గొంతు నొక్కేస్తే, కష్టాన్ని తొక్కేస్తే అక్కడ ఉండటం వృధా. అందుకే ఆ పార్టీతో బంధాన్ని తెంచుకున్నాను” అని రాఘవ స్పష్టం చేశారు.

ప్రజల గొంతుకగా ఉంటాను: తాను పార్టీ మారినప్పటికీ, ప్రజల సమస్యలపై తన పోరాటం ఆగదని రాఘవ హామీ ఇచ్చారు. “ఇకపై మరింత ఉత్సాహంతో, రెట్టింపు శక్తితో ప్రజల గొంతును వినిపిస్తాను. ఇప్పుడు మాకు ఒక మంచి వేదిక దొరికింది, దీని ద్వారా సమస్యలను కేవలం లేవనెత్తడమే కాదు, వాటికి పరిష్కారాలను కూడా చూపగలం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: